ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా నుంచి హయ్యస్ట్ రన్స్ చేసిన టాప్ 5 తోపులు వీళ్లే…

గతంలోనూ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ మంచి ప్రదర్శన కనబర్చాడు.

ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా నుంచి హయ్యస్ట్ రన్స్ చేసిన టాప్ 5 తోపులు వీళ్లే…

Updated On : February 17, 2025 / 5:33 PM IST

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. టీమిండియా ఛాంపియన్స్‌లో తొలి మ్యాచ్‌ ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా పాకిస్థాన్‌ చేతిలో 180 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎనిమిదేళ్ల క్రితం కప్‌ను చేజార్చుకున్నప్పటికీ టీమిండియా ఇప్పుడు ఫేవరెట్‌ టీమ్‌లలో ఒకటిగా ఈ పోటీలో నిలుస్తోంది.

టీమిండియాకు ఛాంపియన్స్‌ ట్రోఫీలో మంచి రికార్డు ఉంది. ఈ ట్రోఫీని మనవాళ్లు రెండుసార్లు గెలిచారు. మన క్రికెటర్లపై ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా నుంచి హయ్యస్ట్ రన్స్ చేసిన టాప్ – 5 బ్యాటర్ల గురించి చూద్దామా?

Also Read: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. 6.5 కోట్ల మందికి లాభం..
హయ్యస్ట్ రన్స్ చేసిన టాప్ 5 బ్యాటర్లు

శిఖర్ ధావన్
ఛాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలో టీమిండియా నుంచి అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో శిఖర్ ధావన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 10 ఇన్నింగ్స్ లలో 77.88 సగటు, 102 స్ట్రైక్ రేట్ తో 701 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి.

సౌరవ్ గంగూలీ
భారత మాజీ ఆటగాడు సౌరవ్‌ గంగూలీకి ఛాంపియన్స్ ట్రోఫీలో గొప్ప చరిత్ర ఉంది. 11 ఇన్నింగ్స్ లలో 73.88 సగటు, 83.22 స్ట్రైక్ రేట్ తో 665 పరుగులు సాధించారు. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి. టీమిండియా నుంచి అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో గంగూలీ 2వ స్థానంలో ఉన్నాడు.

రాహుల్ ద్రవిడ్
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో రాహుల్ ద్రవిడ్ 15 ఇన్నింగ్స్‌లలో 48.23 సగటుతో, దాదాపు 75 స్ట్రైక్ రేట్‌తో 627 పరుగులు చేశాడు. ఆరు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. టోర్నమెంట్ చరిత్రలో టీమిండియా నుంచి అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో ద్రవిడ్‌ 3 స్థానంలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ
అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇది శుభపరిణామం. ఛాంపియన్స్‌ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ క్రికెటర్లలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. 12 ఇన్నింగ్స్‌లలో 88.16 సగటుతో, 90 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 529 పరుగులు సాధించాడు. అతడి అత్యుత్తమ స్కోరు 96 నాటౌట్.

రోహిత్ శర్మ
ఇటీవల రోహిత్ శర్మ ఫామ్‌లో లేనట్లు కనపడ్డాడు. అయితే, కటక్‌లో ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో అద్భుతమైన సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో రోహిత్ శర్మ అదే జోరును కొనసాగించాలని చూస్తున్నాడు.

గతంలోనూ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ మంచి ప్రదర్శన కనబర్చాడు. 10 మ్యాచ్‌ల్లో 53.44 సగటుతో, 82.50 స్ట్రైక్ రేట్‌తో 481 పరుగులు చేశాడు. అందులో నాలుగు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో టీమిండియా నుంచి అత్యధిక పరుగులు చేసినవారి జాబితాలో రోహిత్ 5వ స్థానంలో ఉన్నాడు.