Champions Trophy final to be played on used surface of IND vs PAK clash Report
ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవాలని భారత్ ఆరాటపడుతుండగా, మరోసారి కప్పును ముద్దాడాలని న్యూజిలాండ్ పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చమటోడ్చుతున్నారు.
ఇక ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు ఓ శుభవార్త అందింది. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్‌నే ఆదివారం ఫైనల్ మ్యాచ్‌కు ఉపయోగించనున్నారని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. చాలా పిచ్‌ల మాదిరిగానే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ నెమ్మదిగా ఉంటుంది. బంతి చాలా లేటుగా (ఆగి) వస్తుంటుంది. ఈ పిచ్ స్పినర్లకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది.
IND vs NZ : ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ హెడ్-టు-హెడ్ రికార్డ్స్..
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నాలుగు పిచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే అన్ని పిచ్‌లపై మ్యాచ్‌లు జరిగాయి. దీంతో ఈ నాలుగింటిలో ఉపయోగించిన పిచ్‌పైనే ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఓ పిచ్ పై మ్యాచ్ నిర్వహించిన తరువాత మరోసారి ఆ పిచ్‌ను వినియోగించేందుకు కనీసం రెండు వారల వ్యవధి ఉండాలని ఈసీబీ తెలిపింది. ఫిబ్రవరి 23న భారత్, పాక్ మ్యాచ్ జరిగింది. రెండు వారాల వ్యవధి దాదాపుగా పూర్తి కావడంతో ఈ పిచ్‌ను వినియోగించే అవకాశం ఉందని సదరు వార్తల సారాంశం.
భారత్, పాక్ మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (46; 77 బంతుల్లో 3 ఫోర్లు), ఖుష్‌దిల్ షా (38) లు రాణించగా బాబర్ ఆజామ్ (23)లు ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాలు తలా ఓ వికెట్ సాధించారు.
విరాట్ కోహ్లీ (100 నాటౌట్; 111 బంతుల్లో 7 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (56) హాఫ్ సెంచరీ బాదగా, గిల్ (46) లు రాణించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు, అబ్రార్ అహ్మద్, ఖుష్‌దిల్ షా లు చెరో ఓ వికెట్ తీశారు.