ChampionsTrophy 2025 Shaheen Afridi bowled three wides in 42nd over against India
వన్డేల్లో కింగ్ కోహ్లీ తన 51వ శతకాన్ని అందుకున్నాడు. ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 111 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లతో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ శతకంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కాగా.. ఈ మ్యాచ్‌లోనూ భారత్ తేలికగా విజయం సాధించింది. సింగిల్ హ్యాండ్‌తో కోహ్లీ భారత్‌కు విజయాన్ని అందించాడు. అయితే.. మ్యాచ్ ఆఖరిలో కోహ్లీ శతకం చేస్తాడా లేదా అన్న దానిపై కాస్త ఉత్కంఠ నెలకొంది. 41 ఓవర్లు పూర్తి అయ్యే సరికి భారత స్కోరు 225/4. అక్షర్ పటేల్ (1) ఒక్క పరుగుతో ఆడుతుండగా కోహ్లీ 87 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత విజయానికి 54 బంతుల్లో 17 పరుగులు అవసరం కాగా.. కోహ్లీ శతకానికి 13 పరుగులు కావాల్సి ఉంది.
వైడ్స్ వేసిన షాహీన్ అఫ్రిది..
42వ ఓవర్‌ను షాహీన్ అఫ్రిది వేశాడు. తొలి బంతికి అక్షర్ సింగిల్ తీయగా రెండో బంతికి కోహ్లీ సింగిల్ తీశాడు. అయితే.. మూడో బంతిని వైడ్‌గా వేశాడు షాహీన్ అప్రిది. అక్షర్ పటేల్ లే కాదు వికెట్ కీపర్ కీపర్ రిజ్వాన్ సైతం బంతిని ఆపలేకపోయాడు. అదృష్టవశాత్తు బంతి బౌండరీకి వెళ్లలేదు. ఈ లోపల సింగిల్ తీయడంతో కోహ్లీ స్ట్రైకింగ్‌కు వచ్చాడు.
ఈ సారి కోహ్లీ స్ట్రైకింగ్‌లో ఉండగా మరోసారి వైడ్ వేశాడు షాహీన్. మూడో బంతికి కోహ్లీ రెండు పరుగులు కొట్టాడు. ఇక నాలుగో బంతిని సైతం షాహీన్ వైడ్‌గానే వేశాడు. ఆ తరువాత కోహ్లీ వరుసగా 2, 2, 1 బాది 95 పరుగులకు చేరుకున్నాడు. ఈ ఓవర్‌లో మొత్తంగా 13 పరుగులు వచ్చాయి.
కాగా.. షాహీన్ ఈ ఓవర్‌లో మూడు వైడ్స్ వేశాడు. అతడు కావాలని వేశాడా? ఒత్తిడిలో అలా జరిగిపోయింయో తెలియదు. ఒకవేళ అతడు వేసిన వైడ్‌లో ఒక్కటి బౌండరీకి వెళ్లినా కానీ కోహ్లీ శతకం చేయడం సాధ్యం కాకపోయేది. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఆ మరుసటి ఓవర్‌ను ఖుష్‌దిల్ షా వేశాడు. తొలి బంతికి కోహ్లీ సింగిల్ తీశాడు. అప్పుడు మూడు పరుగులు తీస్తే భారత్ విజయం సాధిస్తుంది. అక్షర్ సింగిల్ తీశాడు. ఆ తరువాత బంతిని బౌండరీకి తరలించి కోహ్లీ శతకం పూర్తి చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ (62) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాలు తలా ఓ వికెట్ సాధించారు. అనంతరం కోహ్లీ శతకంతో పాటు శ్రేయస్ అయ్యర్ (56) హాఫ్ సెంచరీ బాదగా గిల్ (46) సైతం రాణించడంతో భారత్ ఈజీగా విజయాన్ని సాధించింది.