IND vs PAK : కోహ్లీ శతకం పై సునీల్ గవాస్కర్ కామెంట్స్.. తనను క్షమించరని అక్షర్ పటేల్ భావించాడేమో.. అందుకనే..
కోహ్లీ సెంచరీ ముందు చోటు చేసుకున్న పరిణామాలపై సునీల్ గవాస్కర్ మాట్లాడాడు.

Axar Patel realised if he hits a boundary he would never be forgiven says Sunil Gavaskar
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై శతకంతో చెలరేగాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 51వ సెంచరీ. కోహ్లీ (100 నాటౌట్) అజేయ శతకంతో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో కోహ్లీ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కోహ్లీ ఇన్నింగ్స్ ను గవాస్కర్ సైతం ప్రశంసించాడు. కోహ్లీ సెంచరీ కోసం ఆడలేదని, వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ముగించేందుకు చూశాడని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో అక్షర్ పటేల్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఈ మ్యాచ్‌లో ఆఖరిలో కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చే సమయానికి కోహ్లీ 86 పరుగులతో ఆడుతున్నాడు. భారత విజయ సమీకరణం 10 ఓవర్లలో 19 పరుగులుగా ఉంది. కాగా.. 42 ఓవర్లు పూర్తి అయ్యే సరికి భారత స్కోరు 238/4 కి చేరుకుంది. అప్పుడు భారత విజయానికి కేవలం నాలుగు పరుగులు మాత్రమే అవసరం. ఆ సమయానికి కోహ్లీ 95 పరుగులతో ఆడుతున్నాడు.
CCL 2025 : అక్కినేని అఖిల్ ఒంటరి పోరాటం.. సీసీఎల్ 2025లో ముగిసిన తెలుగు వారియర్స్ కథ..
43 ఓవర్ ను ఖుష్‌దిల్ షా వేశాడు. తొలి బంతికి కోహ్లీ సింగిల్ తీశాడు. అప్పుడు మూడు పరుగులు తీస్తే భారత్ విజయం సాధిస్తుంది. ఆ సమయంలో అక్షర్ పటేల్ విన్నింగ్ షాట్‌గా బౌండరీ కొడితే మ్యాచ్ పూర్తి అయ్యేది. కానీ కోహ్లీ సెంచరీని దృష్టిలో ఉంచుకుని అక్షర్ సింగిల్ తీశాడు. ఆ తరువాత బంతిని బౌండరీకి తరలించి కోహ్లీ శతకం పూర్తి చేసుకోగా.. భారత్ మ్యాచ్ గెలిచింది.
అక్షర్ పటేల్ పై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇదే విషయం పై ఓ ఆంగ్ల మీడియాతో సునీల్ గవాస్కర్ మాట్లాడాడు. కోహ్లీ సెంచరీకి అక్షర్ పటేల్ సాయం చేశాడని చెప్పుకొచ్చాడు. కోహ్లీ పట్ల మిగిలిన ఆటగాళ్లకు ఉన్న గౌరవాన్ని ఇది సూచిస్తుందని తెలిపాడు. ఒకవేళ ఆ సమయంలో అక్షర్ బౌండరీ కొట్టి ఉంటే.. అతడిని ఫ్యాన్స్ ఎప్పటికి క్షమించే వారు కాదని అతడు భావించి ఉంటాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. సెంచరీలు చేసే అవకాశం ప్రతీ రోజు రాదన్నాడు. ఓ ఆటగాడిగా జట్టు కోసం పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాలని సూచించాడు. జట్టు కోసం కీలక ఇన్నింగ్స్ ఆడిన సహచర ఆటగాడు శతకం చేసేందుకు సాయం చేయాలన్నాడు.
IND vs PAK : పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే.. వార్నీ ఒకే మ్యాచ్‌లో ఇన్నా..
కోహ్లీ పై ప్రశంసలు..
‘కోహ్లీ చాలా చక్కగా ఆడాడు. అతడు 97 లేదా 98 పరుగులతో ఎందుకు నాటౌట్‌గా మిగిలి పోవాలి. ప్రతి బంతికి పరుగు చేయాల్సిన పరిస్థితి లేదు. కావాల్సినన్ని బంతులు ఉన్నాయి. తన సహచరుల్లో కోహ్లీ ఎంత గౌరవాన్ని కలిగి ఉన్నాడో ఇది తెలియజేస్తుంది. వారు తమ పరుగులను త్యాగం చేయడంతో కోహ్లీ మైలురాయిని సాధించాడు.’ అని గవాస్కర్ అన్నాడు.