CCL 2025 : అక్కినేని అఖిల్ ఒంటరి పోరాటం.. సీసీఎల్ 2025లో ముగిసిన తెలుగు వారియర్స్ కథ..
సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ కథ ముగిసింది.

Celebrity Cricket League 2025 Telugu Warriors lost By 15 Runs Against Bengal Tigers
సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ )2025 సీజన్‌లో తెలుగు వారియర్స్ కథ ముగిసింది. బెంగాల్ టైగర్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. కెప్టెన్ అక్కినేని అఖిల్ ఒంటరి పోరాటం చేసినా తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. ఈ విజయంతో బెంగాల్ టైగర్స్ టేబుల్ టాపర్‌గా సెమీస్‌కు చేరుకుంది.
సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న తెలుగు వారియర్స్ ఆదివారం సూరత్ వేదికగా బెంగాల్ టైగర్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ జిషుసేన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లలో బెంగాల్ టైగర్స్ రెండు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. బెంగాల్ బ్యాటర్లలో జిమ్మీ (78) హాఫ్ సెంచరీతో కథం తొక్కాడు. జిషుసేన్ గుప్తా (14) పర్వాలేదనిపించాడు. తెలుగు వారియర్స్ బౌలర్లలో సాంబ, ఆదిలు చెరో వికెట్ సాధించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో తెలుగు వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. అశ్విన్ బాబు (31) రాణించగా సచిన్ (16), ఆదర్శ (13), తమన్ (14) లు పర్వాలేదనిపించారు. అఖిల్ (1), సాంబ (2), సామ్రాట్ (2) లు విఫలం అయ్యారు. బెంగాల్ బౌలర్లలో రాహుల్, ఆదిత్య, జిమ్మీ, రత్నదీప్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో బెంగాల్‌కు కీలకమైన 19 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
IND vs PAK : పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే.. వార్నీ ఒకే మ్యాచ్‌లో ఇన్నా..
ఆ తరువాత రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్ బ్యాటర్లు మరింత రెచ్చిపోయి ఆడారు. నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేశారు. బెంగాల్ బ్యాటర్లలో జిమ్మీ (54) హాఫ్ సెంచరీ బాదగా.. యాసుఫ్ (31) పరుగులు చేశాడు. తెలుగు వారియర్స్ బౌలర్లలో సామ్రాట్, ఆది, సాంబలు తలా ఓ వికెట్ తీశారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని తెలుగు వారియర్స్ ముందు బెంగాల్ 148 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
అఖిల్ ఒంటరి పోరాటం..
రెండో ఇన్నింగ్స్‌లో తెలుగు వారియర్స్ బ్యాటర్లు తడబడ్డారు. అశ్విన్ బాబు, సామ్రాట్‌లు డకౌట్లు కాగా.. సాంబ (4), తమన్ (18), సచిన్ (12), ఆదర్శ్ (1)లు విఫలం అయ్యారు. దీంతో వారియర్స్ ఓటమి ఖాయమైంది. అయితే.. కెప్టెన్ అఖిల్ (91) సిక్సర్లు, ఫోర్లతో ఒంటరి పోరాటం చేశాడు. దీంతో ఆఖరి ఓవర్‌లో అంటే 6 బంతుల్లో 42 పరుగులు స్థితిలో వారియర్స్ నిలిచింది.
అయితే.. అఖిల్ సిక్సర్లు బాదగా, జిమ్మీ నోబాల్ వేయడంతో మ్యాచ్‌లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ఫ్రీ హిట్ ను సైతం అఖిల్ సిక్సర్‌గా మలిచాడు. అయితే.. జిమ్మీ ఆఖరి మూడు బంతులను జాగ్రత్తగా వేయడంతో వారియర్స్ ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.
ఈ ఓటమితో టోర్నీ నుంచి తెలుగు వారియర్స్ నిష్క్రమించగా, ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన బెంగాల్ టైగర్స్ సెమీస్ చేరుకుంది.