David Lloyd says India Lose More When Jasprit Bumrah Play
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్లు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడుతున్నాయి. మూడు మ్యాచ్‌లు ముగిసే సరికి ఇంగ్లాండ్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆడతాడా? లేదా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి ఉంది.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రా ఇంగ్లాండ్ పర్యటనలో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టును ఎంపిక చేసిన సమయంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే బుమ్రా రెండు మ్యాచ్‌లు ఆడాడు. గంభీర్, అగార్కర్ వ్యాఖ్యలను బట్టి ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో అతడు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడనున్నాడు.
Virat Kohli : కోహ్లీ మనసు మార్చుకో.. టెస్టుల్లో రీ ఎంట్రీ ఇవ్వు..
అయితే.. సిరీస్‌కు కీలకమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో బుమ్రా ఆడతాడా? లేదంటే ఐదో మ్యాచ్‌లో అతడు ఆడతాడా? అన్న దానిపై స్పష్టత లేదు. నాలుగో మ్యాచ్‌లోనే బుమ్రాను బరిలోకి దించాలని టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు జట్టు మేనేజ్‌మెంట్‌కు సూచిస్తున్నారు. అసవరం అనుకుంటే ఐదో మ్యాచ్‌లోనూ ఆడించాలని కోరుతున్నారు.
ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాను ఓ వైపు కొనియాడుతూనే అతడు ఆడిన మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా ఎక్కువగా గెలవలేదన్నాడు.
“కోచ్ గంభీర్ చెప్పిన దాన్ని బట్టి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బుమ్రా మూడు మాత్రమే ఆడతాడు. సిరీస్‌లో ఇంకో రెండు మ్యాచ్‌లే ఉన్నాయి. కాబట్టి అతడు రెండింటిలో ఒకటి మాత్రమే ఆడతాడు. అది ఏ మ్యాచ్ అన్నది చూడాలి. “అని లాయిడ్ అన్నాడు. ‘ఒకవేళ అతడు మాంచెస్టర్‌లో ఆడి భారత్ గెలిస్తే అప్పుడు సిరీస్ 2-2తో సమం అవుతుంది. అయితే.. అప్పుడు సిరీస్ నిర్ణయాత్మకమైన ఐదో మ్యాచ్‌లో బుమ్రాను ఆడించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఒకవేళ అలా కాకుండా నాలుగో టెస్టులో బుమ్రా ఆడి భారత్ ఓడిపోతే అప్పుడు ఐదో మ్యాచ్‌లో అతడు ఆడాల్సిన అవసరం ఉండదు.’ అని లాయిడ్ తెలిపాడు.
ఇదే సమయంలో బుమ్రాపై విమర్శలు గుప్పించాడు. ‘బుమ్రా ఆడిన మ్యాచ్‌లో భారత్ గెలిచిన సందర్భాల కంటే ఓడిన మ్యాచ్‌లే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అతడొక ప్రపంచ స్థాయి బౌలర్, అతడి శైలి భిన్నంగా ఉంటుంది. అయినప్పటికి కూడా అతడి విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.’ అని లాయిడ్ వ్యంగ్యంగా అన్నాడు.
బుమ్రా 2018లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు అతడు భారత జట్టు తరుపున 47 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మరో 23 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఇక ఇంగ్లాండ్‌తో సిరీస్ విషయానికి వస్తే.. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఎడ్జ్‌బాస్టన్ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. మళ్లీ లార్డ్స్ టెస్టులో ఆడాడు. బుమ్రా ఆడిన ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. అతడు విశ్రాంతి తీసుకున్న రెండో టెస్టులో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.