Virat Kohli : కోహ్లీ మనసు మార్చుకో.. టెస్టుల్లో రీ ఎంట్రీ ఇవ్వు..
టీమ్ఇండియా మాజీ ఆటగాడు మదన్ లాల్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఓ విజ్ఞప్తిని చేశాడు.

Virat Kohli Please Come Back says Ex India Legend Madan Lal
లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఈ క్రమంలో లార్డ్స్ ఓటమి తరువాత టీమ్ఇండియా మాజీ ఆటగాడు మదన్ లాల్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఓ విజ్ఞప్తి చేశాడు. కోహ్లీ టెస్టుల్లో తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరాడు.
వాస్తవానికి ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడని అంతా భావించారు. అయితే.. ఈ సిరీస్‌కు నెలరోజుల ముందు అనూహ్యంగా కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. 36 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్ల కంటే ఎంతో ఫిట్‌గా ఉన్న కోహ్లీ ఎందుకు రిటైర్ అయ్యాడనే ప్రశ్న ఇప్పటికి చాలా మందిని వెంటాడుతోంది.
KSCA T20 Auction : పాపం రాహుల్ ద్రవిడ్.. పెద్ద కొడుకు సమిత్‌ను పట్టించుకోని ఫ్రాంచైజీలు..
కోహ్లీ తన మనసు మార్చుకోవాలని ఇప్పటికే ఫ్యాన్స్‌తో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు కోరిన సంగతి తెలిసిందే. ఇక లార్డ్స్‌లో ఓటమి తరువాత కోహ్లీ అవసరం టీమ్ఇండియాకు ఇంకా ఉందని మాజీ ఆటగాడు మదన్‌లాల్ అభిప్రాయపడ్డాడు.
‘కోహ్లీ రిటైర్‌మెంట్ పై వెనక్కి తగ్గడంలో తప్పు లేదు. ఈ సిరీస్‌లో కాకపోయినా కూడా తదుపరి సిరీస్‌లోనైనా అతడు తిరిగి రావాలి. అతడు పునరాగమనం చేస్తే అది టీమ్ఇండియాకు పెద్ద బూస్ట్ అవుతుంది. అతడిలో టెస్టులు ఆడే సత్తా ఇంకో రెండేళ్లకు పైనే ఉంది.’ అని మదన్ లాల్ అన్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నిరాశపరిచిన కోహ్లీ..
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ నిరాశపరిచాడు. అతడు 9 ఇన్నింగ్స్‌ల్లో 23.75 సగటుతో 190 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఈ సిరీస్ తరువాత కోహ్లీ ఐపీఎల్ మధ్యలో టెస్టులకు వీడ్కోలు పలికాడు.
కోహ్లీ మొత్తంగా 123 టెస్టులు ఆడాడు. 46.9 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టు క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.