David Warner : తాగి వాహనం నడిపిన డేవిడ్ వార్నర్.. ఆగస్టు 18న శిక్ష విధించనున్న కోర్టు..
మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) దోషిగా తేలాడు.
David Warner To Be Sentenced On August over Drink Driving
David Warner : మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ దోషిగా తేలాడు. బుధవారం వార్నర్ తప్పు ఒప్పుకోగా, ఆగస్టు 18న అతనికి శిక్ష ఖరారు కానుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈస్టర్ సండే రోజున తన స్నేహితుడి అపార్ట్ మెంట్లో వైన్ తాగిన తర్వాత డేవిడ్ వార్నర్ స్వయంగా కారును నడుపుకుంటూ వెలుతున్నాడు. కొంతదూరంలో రోడ్డు పై బ్రీత్ టెస్టింగ్‌ను చూడగానే వార్నర్ తన వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపి పార్క్ చేశాడు.
అనుమానం వచ్చిన అధికారులు అక్కడికి చేరుకుని బ్రీత్ అనలైజర్‌తో టెస్టు చేశారు. ఇందులో అనుమతికి మించి వార్నర్ మద్యం సేవించినట్లు తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తరువాత బెయిల్ పై అతడిని విడిచిపెట్టారు.
తాజాగా బుధవారం సిడ్నీ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. తాను తీసుకున్న నిర్ణయం చాలా నిర్లక్ష్యంగా, తెలివితక్కువతనంగా ఉందని వార్నర్ తన న్యాయవాది ద్వారా కోర్టులో అంగీకరించాడు. దీంతో అతడికి కోర్టు ఆగస్టు 18న శిక్షను విధించనుంది.
కనీసం ఆరు నెలల పాటు డ్రైవింగ్ నిషేధం, $2,200 జరిమానాతో పాటు 9 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ ప్రస్తుతం లీగ్ క్రికెట్లో ఆడుతున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో ఈ కేసు అతడికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కోర్టు ఏ శిక్షను విధిస్తుందా? అన్న దానిపైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది.
