ఆఖరి బంతికి సిక్స్ కొట్టేద్దామనుకున్నా.. కానీ..

ఆఖరి బంతికి సిక్స్ కొట్టేద్దామనుకున్నా.. కానీ..

Updated On : February 14, 2019 / 7:14 AM IST

హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో ఓటమిపై దినేశ్ కార్తీక్ పశ్చాతాపాన్ని వ్యక్తం చేశాడు. సిరీస్‌కు నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లలో క్రీజులో దినేశ్ కార్తీక్ ఉండడంతో అభిమానులంతా అతనిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఐదు బంతుల్లో 14పరుగులు చేయాల్సిన స్థితిలోనూ ఏ క్షణంలోనైనా మలుపు తిరగొచ్చని భావించారంతా. కానీ, భారత్‌పై తీవ్రమైన ఒత్తిడిని కనబరచిని న్యూజిలాండ్ జట్టు 4పరుగుల తేడాతో గెలుపొందింది. 

ఈ ఓటమిపై ఆలస్యంగా స్పందించిన దినేశ్ కార్తీక్.. తాను చివరి బంతిని సిక్సుగా బాదేద్దామనుకున్నాడట. ‘సింగిల్‌గా ముగించాను కానీ, నిజానికి నేను సిక్సు కొడదామనుకున్నా’ అని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు. టీ20ల్లో దినేశ్ కార్తీక్ మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది లంక పర్యటనలోనూ చివరి మ్యాచ్‌లో సిక్సు బాదేసి మ్యాచ్ గెలిపించడమే కాక, సిరీస్ భారత్ చేజిక్కేలా చేశాడు. 

‘ఓ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎలాంటి ఒత్తిడిలోనైనా భారీ షాట్‍‌లు కొట్టేందుకు సిద్ధంగా ఉండాలి. అదే సమయంలో పార్టనర్‌పైనా నమ్మకముంచాలి. క్రికెట్‌లో అలాంటి సన్నివేశాలు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని సార్లు బ్యాట్స్‌మన్ బౌండరీలను శాసిస్తే, కొన్ని సార్లు బౌలర్ మాయ చేస్తాడు. హామిల్టన్ మ్యాచ్‌లో అదే జరిగింది టిమ్ సౌథీ అలాంటి ఒత్తిడిలోనూ యార్కర్లు వేసి కట్టడి చేయగలిగాడు’ అని కార్తీక్ చెప్పుకొచ్చాడు.