Do you know How many times India reached the finals of ICC events
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. మంగళవారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.
కాగా.. గత రెండు సంవత్సరాల్లో ఐసీసీ నిర్వహించిన ప్రతీ ఈవెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఇందులో టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ 2024ను కైవసం చేసుకుంది. అదే సమయంలో 2023 వన్డే ప్రపంచకప్, 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో పరాజయం పాలైంది.
ఇప్పటి వరకు భారత జట్టు ఎన్ని సార్లు ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్‌కు చేరుకుంది. ఇందులో ఎన్ని సార్లు విజేతగా నిలిచిందో ఓ సారి చూద్దాం. తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో కలిపి ఇప్పటి వరకు భారత్ 13 సార్లు ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్‌కు చేరుకుంది.
2024 టీ20 ప్రపంచకప్ గెలవడాని కన్నా ముందు భారత జట్టు ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్స్‌లో వరుసగా ఐదు సార్లు పరాజయాలను చవిచూసింది. 2000 సంవత్సరంలో భారత్ తొలిసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకుంది. న్యూజిలాండ్ చేతితో ఓడియింది. వాస్తవానికి 1983 వన్డే ప్రపంచకప్ ఐసీసీ టోర్నీల్లో భాగం కాదు.. ఎందుకంటే ఆ టోర్నీని అప్పట్ల్లో ప్రుడెన్షియల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
భారత్ ఆడిన ఐసీసీ ఫైనల్స్ ఇవే..
* ఛాంపియన్స్ ట్రోఫీ (2000) – న్యూజిలాండ్ పై ఓటమి
* ఛాంపియన్స్ ట్రోఫీ (2002) – శ్రీలంక – వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయింది. భారత్, శ్రీలంకను విజేతలుగా ప్రకటించారు.
* వన్డే ప్రపంచకప్ (2003) – ఆస్ట్రేలియాపై ఓటమి
* టీ20 ప్రపంచకప్ (2007) – పాకిస్థాన్ పై విజయం
* వన్డే ప్రపంచకప్ (2011) – శ్రీలంక పై విజయం
* ఛాంపియన్స్ ట్రోఫీ (2013) – ఇంగ్లాండ్ పై గెలుపు
* టీ20 ప్రపంచకప్ (2014) – శ్రీలంక పై ఓటమి
* ఛాంపియన్స్ ట్రోఫీ (2017) – పాకిస్థాన్ పై ఓటమి
* ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (2021) – న్యూజిలాండ్ పై ఓటమి
* ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (2023) – ఆస్ట్రేలియాపై ఓటమి
* వన్డే ప్రపంచకప్ (2023) – ఆస్ట్రేలియా పై ఓటమి
* టీ20 ప్రపంచకప్ (2024) – దక్షిణాఫ్రికా పై విజయం
* ఛాంపియన్స్ ట్రోఫీ (2025) – మార్చి 9న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.