Champions Trophy : సెమీస్‌లో భారత్ చేతిలో ఓటమి.. సంచలన నిర్ణయం తీసుకున్న స్టీవ్ స్మిత్.. వన్డేలకు రిటైర్‌మెంట్
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Steve Smith retires from ODIs After australia lost the semis match against India
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియా కథ ముగిసింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన సెమీస్‌లో భారత్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని భారత్ 48.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి అందుకుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ రాణించాడు. 96 బంతులను ఎదురొన్న అతడు నాలుగు ఫోర్లు, ఓ సిక్స్ బాది 73 పరుగులు చేశాడు.
సెమీఫైనల్‌లో ఓటమి తరువాత స్మిత్ తన నిర్ణయాన్ని తన సహచరులకు తెలియజేశాడు. ఇది చాలా గొప్ప ప్రయాణం అని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించినట్లు స్మిత్ రిటైర్‌మెంట్ ప్రకటనలో తెలిపాడు. ఎన్నో అద్భుతమైన జాప్ఞకాలు ఉన్నాయన్నాడు. రెండు ప్రపంచకప్‌లను (2015, 2023 వన్డే ప్రపంచకప్‌లు) గెలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. తన ప్రయాణంలో తోడుగా ఉన్న సహచర ఆటగాళ్లతో పాటు సెలక్టర్లకు కృతజ్ఞతలను చెప్పాడు.
🚨 STEVEN SMITH ANNOUNCED HIS RETIREMENT FROM ODI CRICKET. 🚨 pic.twitter.com/OBkNCLsbG6
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2025
తాను వన్డేలకు వీడ్కోలు చెప్పేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు తెలిపాడు. 2027 వన్డే ప్రపంచకప్‌కు జట్టును సిద్ధం చేసేందుకు ఇది ఓ గొప్ప అవకాశం అని చెప్పాడు. వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటికి టెస్టులతో పాటు టీ20లను ఆడతాడని చెప్పుకొచ్చాడు. టెస్టులకు ఇంకా ఆదరణ ఉందన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌తో పాటు ఆ తరువాత వెస్టిండీస్, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
స్టీవ్ స్మిత్ 64 వన్డే మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. అతడి నాయకత్వంలో ఆస్ట్రేలియా 32 మ్యాచ్‌ల్లో గెలవగా 28 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయపడడంతో తాతాల్కిక సారథిగా ఛాంపియన్స్ ట్రోఫీకి స్మిత్ నాయకత్వం వహించాడు.
స్మిత్ ఆస్ట్రేలియా తరుపున 170 వన్డేలు ఆడాడు. 154 ఇన్నింగ్స్‌ల్లో 43.28 సగటుతో 87 స్ట్రైక్‌రేటుతో 5800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో ఆస్ట్రేలియా తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్‌లో 28 వికెట్లు పడగొట్టాడు.