Nitish Kumar Reddy Father Sacrifices : కొడుకు క్రికెట్ కెరీర్ కోసం నితీష్ రెడ్డి తండ్రి ఏమేమీ త్యాగం చేశాడో తెలుసా?
ఆస్ట్రేలియా గడ్డపై అదిరిపోయే సెంచరీతో టెస్టు జట్టులో తన స్థానాన్ని దాదాపుగా సుస్థిరం చేసుకున్నాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.

Do you know Nitish Kumar Reddy Father Sacrificed for his sons cricket career
ఆస్ట్రేలియా గడ్డపై అదిరిపోయే సెంచరీతో టెస్టు జట్టులో తన స్థానాన్ని దాదాపుగా సుస్థిరం చేసుకున్నాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. మెల్‌బోర్న్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి అడుగుపెట్టిన నితీష్ తనదైన శైలిలో పరుగులు చేస్తూ శతకం సాధించాడు. 171 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో మూడు అంకెల స్కోరు అందుకున్నాడు.
నితీష్ రెడ్డి సెంచరీ చేయడాన్ని ఆయన తండ్రి ప్రత్యక్షంగా వీక్షించాడు. ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి లోనైయ్యాడు. తన కుమారుడిని క్రికెటర్ చేయడం కోసం ముత్యాలరెడ్డి పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. 23 ఏళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ఈ క్రమంలో అతడు తీసుకున్న నిర్ణయం పై బంధువులు విమర్శలు చేశారు. అయినప్పటికి కొడుకు కోసం అన్నింటిని భరించాడు. ఈ రోజు ఆయన పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది.
నాన్న నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు..
చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు తాను క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోలేదని బీసీసీఐ టీవీతో నితీష్ చెప్పాడు. నా కోసం మా నాన్న ఉద్యోగాన్ని వదిలేశారు. నేను క్రికెటర్‌గా మారేందుకు ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. ఆర్థిక సమస్యల కారణంగా ఓ సారి నాన్న ఏడవడం చూశాను. మేం ఎదుర్కొన్న కష్టాలు, మా నాన్న త్యాగం ముందు నా శ్రమ తక్కువే అని అనిపించింది.
అప్పటినుంచే నేను క్రికెట్‌పై సీరియస్‌గా దృష్టిపెట్టాను. ఓ ఆటగాడిగా నిరంతరం నన్ను నేను మెరుగుపరచుకుంటూ వచ్చాను. ఇప్పుడు దీనికి ప్రతిఫలం దక్కింది. నాన్నను సంతోషంగా ఉంచుతున్నందుకు గర్వపడుతున్నాను. నా తొలి జెర్సీని ఆయనకే ఇచ్చేశాను అని నితీష్ రెడ్డి చెప్పారు.
ఆంధ్రా క్రికెట్ అకాడమీలో శిక్షణకు ముందు..
ఆంధ్రా క్రికెట్ అకాడమీలో శిక్షణకు ముందే నితీష్ రెడ్డి మాజీ సెలక్టర్ ఎమ్ఎస్‌కే ప్రసాద్ దృష్టిలో పడ్డాడు. 2016-17లో విజయ్ మర్చాంట్ టోర్నమెంట్‌లో నాగాలండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 441 పరుగులు పరుగులు సాధించాడు. అంతేకాదు ఈ టోర్నమెంట్‌లో 26 వికెట్లు పడగొట్టి ఓ రౌండర్‌గా గుర్తింపు సాధించుకున్నాడు. ఎమ్మెస్కే ప్రసాద్ సాయంతో కడపలోని ఏసీఏ అకాడమీలో చేరి మరింత రాటు దేలాడు.
అయితే.. జిల్లా స్థాయి క్రికెట్‌లో తన తొలి సంవత్సరంలో నితీష్ పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో నితీష్ అద్భుతమైన ఆటగాడు కాదని, అతడిని చదువు పై దృష్టి సారించేలా చేయాలని అతడి తండ్రి ముత్యాల రెడ్డికి కొందరు సలహా ఇచ్చారు. అయితే.. ముత్యాలరెడ్డి మాత్రం కొడుకు పై ఉన్న నమ్మకంతో మెరుగైన సౌకర్యాలు గలిగిన స్టేడియాల్లో అతడికి శిక్షణ ఇప్పించారు.
మూడేళ్లలోనే..
2020లో ఆంధ్రా జట్టు తరఫున రంజీల్లో నితీష్ అరంగేట్రం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ .. రెండు విభాగాల్లో మంచి ప్రదర్శన చేస్తూ జట్టుకు కొండంత అండగా నిలిచాడు. దేశవాళీలో నిలకడగా రాణించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కన్ను అతడిపై పడింది. ఐపీఎల్ 2023 వేలంలో అతడిని రూ.20లక్షలకు సొంతం చేసుకుంది.
ఐపీఎల్‌తో అతడి జీవితం మారిపోయింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ అతడికి వరుస అవకాశాలు ఇవ్వడంతో తనను తాను నిరూపించుకుంటూ పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఎస్ఆర్‌హెచ్ ను ప్లే ఆప్స్‌కు తీసుకువెళ్లడంతో కీలక పాత్ర పోషించాడు.
జాతీయ జట్టులో చోటు..
ఈ ప్రదర్శనతో ఈ ఏడాది అతడు టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. టీ20ల్లో తనదైన మార్కును చూపించాడు. ఈ క్రమంలో అతడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక అయ్యాడు. అతడిని ఆసీస్ సిరీస్ కు ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పు పట్టారు. అయితే.. నిలకడతో పాటు అద్భుతమైన ప్రదర్శనలతో నితీష్ ఆకట్టుకుంటున్నాడు. ఈ సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 71 సగటుతో 284 పరుగులు చేశాడు. టెస్టుల్లో తన తొలి సెంచరీని అందుకున్నాడు.
ఇదొ ప్రత్యేకమైన రోజు..
నితీష్ తొలి సెంచరీ సాధించడంపై అతడి తండ్రి ముత్యాల రెడ్డి మాట్లాడాడు. తమ కుటుంబానికి ఇదొ ప్రత్యేకమైన రోజు అని అన్నారు. ఈ రోజును ఎన్నటికి మరిచిపోలేమని చెప్పారు. 14 ఏళ్ల నుంచే నితీష్ క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడని అన్నారు. అప్పటి నుంచే అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ వస్తున్నాడని చెప్పారు. ఈ సెంచరీని ప్రత్యక్షంగా చూడటాని మాటల్లో చెప్పలేకపోతున్నానని అన్నాడు. 99 పరుగుల వద్ద నితీష్ ఉన్నప్పుడు ఎంతో టెన్షన్‌కు గురి అయ్యానని చెప్పాడు. అప్పటికి ఒక్క వికెట్ మాత్రమే ఉంది. సిరాజ్ బాగా ఆడాడు. ఆఖరికి నితీష్ సెంచరీ చేయడంతో చాలా సంతోషంగా ఉంది అని ముత్యాల రెడ్డి అన్నారు.
An emotional interview of Nitish Kumar Reddy’s family. 🥹❤️pic.twitter.com/MgivG6mlkH
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2024