Betting App Case : బెట్టింగ్ యాప్స్ కేసు.. మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌కు బిగ్ షాకిచ్చిన ఈడీ
Betting App Case : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Betting App Promotion Case
Betting App Case : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్ (Shikhar Dhawan), సురేశ్ రైనా (Suresh Raina) లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బిగ్ షాకిచ్చింది. ఈ కేసులో వారిద్దరికి సంబంధించి రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఇటీవల ఈ కేసులో ఈడీ విచారణకు మాజీ క్రికెటర్లు హాజరయ్యారు.
అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ఆస్తుల అటాచ్ లో భాగంగా ధావన్ కు సంబంధించి రూ.4.5కోట్లు విలువైన స్థిరాస్తి ఉండగా.. రైనాకు సంబంధించిన రూ.6.64కోట్ల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఉన్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ప్రకారం ఏజెన్సీ అటాచ్‌మెంట్ ఆర్డర్ జారీ చేసింది.
ఇదిలాఉంటే.. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప, నటులు సోను సూద్, ఊర్వశీ రౌతేలా, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా వంటి అనేక మంది ప్రముఖులను కూడా ఇప్పటికే ఈడీ ప్రశ్నించింది. బెట్టింగ్ కంపెనీలతో, దాని సర్రోగేట్ వెంచర్లతో వారికున్న సంబంధాలపై స్పష్టమైన వివరాలు సేకరించేందుకు ఈడీ వారిని విచారించింది.
