eight Sri Lankan players set to return home from Pakistan due to safety concerns
PAK vs SL: పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సందిగ్ధంలో పడింది. మంగళవారం ఇస్లామాబాద్‌లో జరిగిన బాంబు పేలుడులో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంక ఆటగాళ్లు తమ భద్రత పై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని తమ క్రికెట్ బోర్డుకు తెలియజేశారు. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా 8 మంది ఆటగాళ్లు వెంటనే పాకిస్తాన్‌ను వీడి స్వదేశానికి (శ్రీలంక) వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ గురువారం రావల్సిండి వేదికగా జరగాల్సి ఉంది. అయితే.. లంక ఆటగాళ్లు గురువామే స్వదేశానికి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సిరీస్ రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇదే వేదిక పై జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ సిరీస్ తరువాత ముక్కోణపు సిరీస్ జరగాల్సి ఉంది. పాక్, లంకతో పాటు మూడో జట్టుగా జింబాబ్వే బరిలోకి దిగాల్సి ఉంది.
ఇస్లామాబాద్‌కు చాలా దగ్గరలోనే రావల్పిండి ఉండడం లంక క్రికెటర్ల ఆందోళనను మరింత పెంచుతోంది. కాగా.. ఇప్పటికే లంక క్రికెట్ బోర్డు అధికారులు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో క్రికెటర్లు, జట్టు సిబ్బంది సభ్యుల భద్రతపై చర్చించారు. పీటీఐ ప్రకారం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నఖ్వీ శ్రీలంక క్రికెట్ జట్టు అధికారులను కూడా కలిశారు. వారికి భద్రతపై హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో జట్టును వీడే 8 మంది ఆటగాళ్ల స్థానాలను రిజర్వ్ బెంచీలోని ప్లేయర్లలో భర్తీ చేసి సిరీస్ కొనసాగించేలా ప్రయత్నం చేస్తామని పీసీబీకి లంక బోర్డు సూచన ప్రాయంగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
IND vs SA : కోల్‌కతా వేదికగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్టు.. వర్షం ముప్పు ఉందా?
సరిగ్గా 16 ఏళ్ల క్రితం అంటే.. 2009లో లాహోర్‌లోని గడాఫీ స్టేడియానికి శ్రీలంక ఆటగాళ్లు బస్సులో వెలుతుండగా తీవ్రవాదులు దాడి చేశారు. లంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో పలువురు లంక ఆటగాళ్లకు తూటాలు తగిలాయి. ఈ ఘటన తరువాత దాదాపు 10 ఏళ్ల పాటు ఏ విదేశీ జట్టు కూడా పాక్‌లో పర్యటించలేదు. 2019 డిసెంబర్‌లో శ్రీలంక జట్టు పాక్‌కు వెళ్లింది. ఆ తరువాతనే విదేశీ జట్లు పాక్‌లో ఆడడం మొదలైంది.