ENG vs IND : ఇంగ్లాండ్‌కు భారీ షాక్.. రెండో రోజు బెన్‌స్టోక్స్ ఆడడం అనుమానమేనా? కెప్టెన్ గాయం పై ఓలీపోప్ కీలక అప్‌డేట్..
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ చివరి సెషన్‌లో కాస్త అసౌకర్యంతో కనిపించాడు.

ENG vs IND 3rd Test Vice captain Ollie Pope given Ben Stokes injury update
లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు ఆటలో ఓ వైపు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ గాయంతో మైదానాన్ని వీడగా, మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ చివరి సెషన్‌లో కాస్త అసౌకర్యంతో కనిపించాడు. అతడి గజ్జలో నొప్పితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రెండో రోజు అతడు బ్యాటింగ్‌కు వస్తాడా? లేడా? అతడి గాయం తీవ్రత ఎంత అన్న దానిపై ఇంగ్లాండ్ అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.
తొలి రోజు ఆటలో స్టోక్స్ తన వ్యక్తిగత స్కోరు 32 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. నితీశ్ కుమార్ రెడ్డి ఆఫ్ స్టంప్ వెలుపల వేసిన బంతిని వదిలేశాడు. అయితే.. వెంటనే నొప్పితో విలవిలలాడాడు. తన కుడి గజ్జను పట్టుకున్నాడు. వెంటనే ఫిజియోలు మైదానంలోకి వచ్చి అతడికి చికిత్స అందించాడు. ఆ తరువాత ఆటను కొనసాగించిన స్టోక్స్.. సింగిల్స్ తీసే క్రమంలో తీవ్ర అసౌకర్యానికి గురి అయ్యాడు. మిగిలిన ఆట మొత్తం కూడా అలాగే ఉన్నాడు.
కాగా.. తొలి రోజు ఆట ముగిసిన తరువాత బెన్‌స్టోక్స్ గాయంపై వైస్ కెప్టెన్ ఓలీ పోప్ స్పందించాడు. అతడి గాయం గురించి పూర్తి వివరాలు తనకు తెలియవని చెప్పాడు. అయినప్పటికి స్టోక్స్ రాత్రికి రాత్రే కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. రాబోయే నాలుగు రోజులు పెద్ద పరీక్ష అని, స్టోక్స్ అద్భుతాలు చేస్తాడని అన్నాడు. రేపు అతడు ఎలా రాణిస్తాడో చూడాలన్నాడు. ప్రస్తుతం వైద్య సిబ్బంది పర్యవేక్షణలో అతడు ఉన్నాడని చెప్పాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. జోరూట్ (99), బెన్‌స్టోక్స్ (39) క్రీజులో ఉన్నారు. అభేద్యమైన ఐదో వికెట్‌కు రూట్-స్టోక్స్ జోడీ 79 పరుగులు జోడించింది.