ENG vs IND : ఒకవేళ పంత్ గాయంతో మిగిలిన మ్యాచ్‌కు దూరమైతే ఏం జరుగుతుంది? అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ చేయొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
గాయం కారణంగా రిషబ్ పంత్ లార్డ్స్ టెస్టు మొత్తానికి దూరం అయితే ఏం జరుగుతుందంటే..

What happen if Rishabh Pant miss the match due to Injury in lords test
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని భావిస్తున్న భారత్‌కు గట్టి షాక్ తగిలేలా ఉంది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో గురువారం ప్రారంభమైన మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. అతడి ఎడమచూపుడు వేలికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. రెండో సెషన్‌లో గాయపడిన అతడు తొలి రోజు ఆటలో మళ్లీ మైదానంలోకి రాలేదు.
పంత్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు. అయితే.. ఒకవేళ పంత్‌కు అయిన గాయం చాలా తీవ్రమైనది అయి అతడు మూడో టెస్టు మొత్తానికి దూరం అయితే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలో ఉంది. ధ్రువ్ జురెల్.. పంత్ స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చా? అన్న సందేహం ఉంది.
ENG vs IND : రిషబ్ పంత్ గాయంపై నితీశ్‌కుమార్ రెడ్డి అప్‌డేట్..
ఒకవేళ పంత్ ఈ మ్యాచ్‌కు మొత్తం దూరం అయినా సరే ఐసీసీ నిబంధనల ప్రకారం ధ్రువ్ జురెల్ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేడు. అతడు కేవలం వికెట్ కీపింగ్, ఫీల్డింగ్ చేయొచ్చు. అప్పుడు భారత జట్టుకు ఓ బ్యాటర్ తక్కువ అవుతాడు. టీమ్ఇండియా బ్యాటింగ్‌లో 9 వికెట్లు కోల్పోగానే ఆలౌట్ కిందే పరిగణిస్తారు.
సూపర్ ఫామ్‌లో ఉన్న పంత్ బ్యాటింగ్‌కు రాకపోతే అది భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఈ సిరీస్‌లో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పంత్ రెండో స్థానంలో ఉన్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 85.50 సగటుతో 342 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ అర్థసెంచరీ ఉంది.
కంకషన్ గురైతే మాత్రమే..
మ్యాచ్ సమయంలో ఓ ఆటగాడు కంకషన్‌కు గురి అయితే.. అతడి స్థానంలో ఆడే ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేయొచ్చు. కంకషన్ మినహా మరే ఇతర కారణాల వల్ల ఆటగాడు మ్యాచ్ మధ్యలో దూరం అయితే అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే ఆటగాడు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేస్తాడు.