ENG vs IND 4th test Morne Morkel throws Shubman Gill under the bus
మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పట్టుబిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెప్టెన్ బెన్‌స్టోక్స్ (77), లియామ్ డాసన్ (21) లు క్రీజులో ఉన్నారు.
కాగా.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను చాలా ఆలస్యంగా బౌలింగ్ చేయించడం పై అలాగే స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడం పై ప్రశ్నలు తలెత్తున్నాయి. వీటికి టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీమోర్కెల్ మూడో రోజు ఆట ముగిసిన తరువాత సమాధానం ఇచ్చాడు.
పేసర్లను ఎక్కువగా ఉపయోగించుకోవాలని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భావించడంతోనే వాషింగ్టన్ సుందర్‌ను ఆలస్యంగా బౌలింగ్‌కు దించి ఉండవచ్చునని మోర్కెల్ తెలిపాడు. అదే విధంగా బ్యాటింగ్ బలాన్ని పెంచే ఉద్దేశ్యంతోనే కుల్దీప్ యాదవ్‌కు జట్టులో చోటు ఇవ్వలేకపోయినట్లు పేర్కొన్నాడు.
వాషింగ్టన్ సుందర్ లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. అయినప్పటికి నాలుగో టెస్టు మ్యాచ్‌లో 69వ ఓవర్ వరకు అతడి చేతికి గిల్ బంతిని ఇవ్వలేదు. కాగా.. సుందర్ తన చేతికి బంతి వచ్చిన తరువాత తొలి స్పెల్‌లోనే సెట్ బ్యాటర్ ఓలీపోప్‌తో పాటు హ్యారీ బ్రూక్‌ను స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేర్చాడు. మొత్తంగా అతడు 19 ఓవర్లు వేసి 57 పరుగులు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
అన్షుల్‌ను ఎందుకు తీసుకున్నారంటే..
పిచ్‌పై ఖచ్చితంగా నిరంతరం బౌలింగ్ చేయగల ఆటగాడు అవసరమని, అందుకే అన్షుల్ కాంబోజ్‌ను ఎంపిక చేసినట్లు మోర్కెల్ తెలిపాడు. ఇక స్టార్ పేసర్లు బుమ్రా, సిరాజ్‌లు గాయాలతో బాధపడుతున్నట్లు చెప్పాడు. మడమ నొప్పితో బాధపడుతున్నారన్నాడు. అయినప్పటికి వీరిద్దరు మంచి ఫిట్‌నెస్‌తోనే ఉన్నారన్నాడు. మొత్తంగా రెండో రోజు ఆటతో పోలిస్తే మూడో రోజు ఆటలో తమ బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారని, పెద్దగా పరుగులు ఇవ్వలేదని మోర్కెల్ చెప్పాడు.