ENG vs IND : అరంగ్రేట ఆటగాడు అన్షుల్ కాంబోజ్ పై కోపంతో ఊగిపోయిన జడేజా.. అక్కడే నిలబడితే ఎలా.. ఇక్కడికి రావొచ్చుగా..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా అరంగ్రేట ఆటగాడు అన్షుల్ కాంబోజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ENG vs IND 4th test Ravindra Jadeja fires on Anshul Kamboj As Fielding Blunder
మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పట్టుబిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెప్టెన్ బెన్‌స్టోక్స్ (77), లియామ్ డాసన్ (21) లు క్రీజులో ఉన్నారు.
మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ (150) భారీ శతకంతో కదం తొక్కాడు. టీమ్ఇండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఆఖరికి జడేజా బౌలింగ్ లో స్టంపౌంట్ అయ్యాడు. కాగా.. వ్యక్తిగత స్కోరు 23 పరుగుల వద్ద భారత ఫీల్డర్ల తప్పిదం కారణంగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు రూట్. ఈ సమయంలో టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా అరంగ్రేట ఆటగాడు అన్షుల్ కాంబోజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అసలేం జరిగిందంటే..
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 54వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్‌ను సిరాజ్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతిని రూట్ గల్లీ దశగా షాట్ ఆడి సింగిల్ కోసం పరిగెత్తాడు. గల్లీ దగ్గరగా ఫీల్డింగ్ చేస్తున్న జైశ్వాల్ బంతిని ఆపేందుకు ప్రయత్నించగా.. బాల్ అతడి చేతులను తాకి జడేజా దిశగా వెళ్లింది. వెంటనే బంతిని అందుకున్న జడేజా నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు వేగంగా బంతిని వేశాడు. అయితే.. అతడు వేసిన త్రో వికెట్లను తాకలేదు. అప్పటికి రూట్ ఇంకా పిచ్ మధ్యలోనే ఉన్నాడు.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) July 25, 2025
బౌలర్ ఎండ్‌లో ఏ ఒక్క ఫీల్డర్ కూడా లేకపోవడంతో రూట్ బతికి పోయాడు. మిడాన్ ఆన్‌లో ఉన్న కాంబోజ్ బంతిని పట్టుకున్నాడు. అయితే.. రూట్ షాట్ ఆడగానే కాంబోజ్ గనుక నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వద్దకు వచ్చి ఉంటే.. జడేజా బంతిని అందుకుని వికెట్లను పడగొట్టి ఉంటే రూట్ రనౌట్ అయ్యేవాడు.
దీనిపైనే జడేజా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అక్కడే ఎందుకు ఉన్నావు? వికెట్ల వద్దకు ఎందుకు రాలేదు అని అన్షుల్ కాంబోజ్ పై అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవేళ రూట్ రనౌట్ అయి ఉంటి ప్రస్తుత మ్యాచ్ పరిస్థితి మరోలా ఉండేది. ఫీల్డర్ల అలసత్వం వల్ల భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.