ENG vs IND : శుభ్‌మన్ గిల్ పై రవిశాస్త్రి ఆగ్రహం.. ఇవేం వ్యూహాలు.. నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌ను..
మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పట్టుబిగించింది

ENG vs IND 4th Test Ravi Shastri fires on Shubman Gill After Blunders On Day 3
మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. బెన్‌స్టోక్స్ (77), లియామ్ డాసన్ (21) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 358 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
మూడో రోజు ఆట ముగిసిన తరువాత టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ పై రవిశాస్త్రి మండిపడ్డాడు. అతడి వ్యూహాలను ప్రశ్నించాడు. స్కై స్పోర్ట్స్‌తో శాస్త్రి మాట్లాడుతూ వాషింగ్టన్ సుందర్‌తో చాలా ఆలస్యంగా బౌలింగ్ చేయించడాన్ని తప్పుబట్టాడు. అదే విధంగా కొత్త బంతిని అరంగ్రేట ఆటగాడు అన్షుల్ కాంబోజ్ ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రశ్నించాడు. గిల్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇంగ్లాండ్ పై ఒత్తిడి తగ్గించాయని పేర్కొన్నాడు.
మూడో టెస్టులో సుందర్ నాలుగు వికెట్లు తీశాడు. అలాంటి బౌలర్‌ను 67, 69 ఓవర్ తరువాత బౌలింగ్‌కు తీసుకురావడంలో అర్థం ఏంటో తెలిదు. ఇలా చేస్తే ఆ ఆటగాడి నమ్మకం పోతుందన్నాడు. “ఫామ్‌లో ఉన్న సుందర్ తాను ఫ్రంట్ లైన్ స్పిన్నర్‌గా ఉండాలని అనుకుంటాడని, తొలి 30, 35 ఓవర్లలో బౌలింగ్ చేయాలని భావిస్తాడు. కానీ అతడికి 69 ఓవర్ తరువాత బౌలింగ్ ఇచ్చారు. ఆ వెంటనే అతడు రెండు వికెట్లు తీశాడు. చూస్తుంటే గిల్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం అయినట్లుగా కనిపిస్తుంది.” అని శాస్త్రి అన్నాడు.
ఇక తొలి టెస్టు ఆడుతున్న అన్షుల్‌కు నిన్న కొత్త బంతిని ఇవ్వాల్సింది కాదని, సిరాజ్ కు ఇచ్చి ఉంటే బాగుండేదని శాస్త్రి చెప్పుకొచ్చాడు. కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇంగ్లాండ్ జట్టు పై ఒత్తిడి తగ్గించిందని తెలిపాడు.
అయితే.. గిల్‌కు కెప్టెన్సీ కొత్త అని కాలం గడిచే కొద్ది అతడు మెరుగుపడతాడనే ఆశాభావాన్ని శాస్త్రి వ్యక్తం చేశాడు. అందుకు అతడికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు సీనియర్ ఆటగాళ్ల సాయం అవసరం అని చెప్పాడు.
అదే సమయంలో జట్టులోని కొంతమంది సీనియర్ ఆటగాళ్లను కూడా శాస్త్రి విమర్శించారు. జట్టులోని సీనియర్ ఆటగాళ్ళు జవాబుదారీగా ఉండటం ప్రారంభించాలన్నాడు. ఓ 50, 60 టెస్టులు ఆడిన ప్లేయర్ కెప్టెన్ వద్దకు వెళ్లి నేను వికెట్ తీయాలని అనుకుంటున్నాను. నాకు ఈ రకమైన ఫీల్డింగ్ సెటప్ కావాలని అని నాయకుడికి చెప్పాలి. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ చేసేది కూడా ఇదే. అతడు భాగస్వామ్యాలను ఎలా విడగొట్టాలి, ఎలా వికెట్ తీయాలి అని ఆలోచిస్తాడు అని శాస్త్రి అన్నాడు.