ENG vs IND 5th test Shubman Gill eye on 5 huge milestones
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్‌లోనే బ్యాటర్‌గా దుమ్ములేపుతున్నాడు శుభ్‌మన్ గిల్. ఇంగ్లాండ్ గడ్డ పై జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్నాడు. నాలుగు టెస్టుల్లో 722 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో తన అద్భుత ప్రతిభతో ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
గురువారం (జూలై 31) నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గిల్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో ఓ సారి చూసేద్దాం..
సునీల్ గవాస్కర్..
ఈ మ్యాచ్‌లో గిల్ 53 పరుగులు చేస్తే.. ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. 1971లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో గవాస్కర్ 154.80 సగటుతో 774 పరుగులు చేశాడు.
ENG vs IND : పొంచి ఉన్న వర్షం ముప్పు..! ఆఖరి టెస్టులో కీలకం కానున్న టాస్..!
89 రన్స్ చేస్తే..
టీమ్ఇండియా తరుపున ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ రికార్డు ఇప్పటికే గిల్ సొంతం చేసుకున్నాడు. అయితే.. ఓవరాల్‌గా ఈ రికార్డు సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. 1936-37 సీజన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బ్రాడ్‌మన్ 810 పరుగులు చేశాడు. బ్రాడ్‌మన్‌ను అందుకునేందుకు గిల్ 89 పరుగులు అవసరం.
253 పరుగులు..
ఓ టెస్టు సిరీస్‌ళో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు సర్ డాన్ బ్రాడ్‌మన్ సొంతం. 1930లో యాషెస్ సిరీస్‌లో బ్రాడ్‌మన్ 974 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు మ్యాచ్‌లో గిల్ గనుక 253 పరుగులు చేస్తే బ్రాడ్‌మన్ రికార్డును బ్రేక్ చేస్తాడు.
ఒక్క సెంచరీ..
ఐదో టెస్టులో గిల్ సెంచరీ చేస్తే ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం గిల్ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో 4 శతకాలు బాదాడు. డాన్ బ్రాడ్‌మన్ 1974లో ఇంగ్లాండ్ పై, సునీల్ గవాస్కర్ 1978లో విండీస్ పై టెస్టు సిరీసుల్లో నాలుగేసి సెంచరీలు చేశాడు.
అంతేకాదండోయ్.. ఓ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడి రికార్డు వెస్టిండీస్‌కు చెందిన క్లైడ్ వాల్‌కట్ పేరిట ఉంది. 1955లో అతడు ఆస్ట్రేలియా పై ఐదు సెంచరీలు బాదాడు. ఐదో టెస్టులో గిల్ సెంచరీ చేస్తే క్లైడ్ వాల్‌కట్ రికార్డును సమం చేస్తాడు. అదే రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు శతకాలు బాదితే ఆరు సెంచరీలతో గిల్ అగ్రస్థానంలో నిలుస్తాడు.