ENG vs IND 5th test Team India record at Kennington Oval
అండర్సన్-టెండూల్కర్ టోఫ్రీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు నాలుగు టెస్టులు జరుగగా రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఓ మ్యాచ్‌లో భారత్ గెలవగా, మరో మ్యాచ్ డ్రా ముగిసింది. ప్రస్తుతం సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరగనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ సిరీస్‌ను గెలవాలని ఆరాటపడుతోంది. ఐదో టెస్టు మ్యాచ్‌లో గెలిచినా లేదంటే డ్రా చేసుకున్నా కూడా సిరీస్ ఇంగ్లాండ్ సొంతం అవుతుంది.
WI vs AUS : టీ20ల్లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా..
ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో భారత రికార్డు ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
1936 నుంచి ఓవల్ మైదానంలో 15 టెస్టులను భారత్ ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లోనే భారత్ గెలిచింది. 6 మ్యాచ్‌ల్లో ఓడిపోగా, మరో 7 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఇక ఈ మైదానంలో భారత్ చివరిసారిగా 2023 డబ్య్లూటీసీ ఫైనల్ ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన నాటి మ్యాచ్‌లో 209 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.
ఇక ఈ మైదానంలో భారత అత్యధిక స్కోరు 664 పరుగులు. 2007లో ఇంగ్లాండ్ పైనే భారత్ ఈ ఘనత సాధించింది. ఇక ఈ మైదానంలో భారత్ చేసిన అత్యల్ప పరుగులు 94. 2014లో ఇంగ్లాండ్ పైనే కావడం గమనార్హం. ఇక ఈ మైదానంలో సునీల్ గవాస్కర్ 1979లో డబుల్ సెంచరీ (221) చేశాడు. ఇప్పటి వరకు మరే భారత బ్యాటర్ కూడా ఈ మైదానంలో గవాస్కర్ స్కోరును దాటలేదు.