ENG vs IND 5th test Will injured Chris Woakes come to bat on Day 5
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. జేమీ ఓవర్టన్ (0), జేమీ స్మిత్ (2) లు క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా.. భారత గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి.
ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సిరీస్ సమం కానుండగా.. ఇంగ్లాండ్ విజయం సాధిస్తే 3-1 తేడాతో సిరీస్ ఆతిథ్య జట్టు సొంతం అవుతుంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్‌వోక్స్ పై పడింది. అవసరం అయితే అతడు బ్యాటింగ్‌కు వస్తాడా? రాడా? అన్న విషయం పై పడింది.
ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ క్రిస్‌వోక్స్ గాయపడిన సంగతి తెలిసిందే. బంతిని ఆపే క్రమంలో డైవ్ చేసిన సమయంలో అతడి ఎడమ భుజం నేలను బలంగా తాకింది. దీంతో అతడు తీవ్ర మైన నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో వచ్చి పరిశీలించగా.. అతడి భుజం స్థానభ్రంశమైనట్లు కనిపించడంతో వెంటనే అతడిని మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఆ తరువాత ఆస్పత్రికి తరలించారు.
తీవ్రమైన గాయం కావడంతో అతడు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కూడా చేయలేదు. అయితే.. ఇప్పుడు ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులకే అవసరం కావడంతో అతడు బ్యాటింగ్‌కు వస్తాడా? రాడా? అన్న దానిపై సీనియర్ ఆటగాడు జోరూట్ సమాధానం ఇచ్చాడు. అవసరం అయితే.. అతడు బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు.
“మీరు చూసినట్లయితే.. అతడు తెల్లటి దుస్తులు ధరించి ఉండడం చూసి ఉంటారు. అతడు మిగతా అందరిలాగానే ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. విజయానికి మరో 35 పరుగులు మాత్రమే అవసరం. అయితే.. వోక్స్ బ్యాటింగ్‌కు దిగే అవసరం రాకపోవచ్చు. మిగిలిన వారే మ్యాచ్‌ను ముగించవచ్చు. ఒకవేళ అతడు బ్యాటింగ్‌కు దిగాల్సిన పరిస్థితి వస్తే మాత్రం అతడు ఖచ్చితంగా బ్యాటింగ్ చేస్తాడు. “అని రూట్ అన్నాడు.