FIFA World Cup 2026 : మెక్సికో మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు వయాగ్రా!
ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ దశలో మెక్సికోతో జరిగే రౌండ్ ఆఫ్-16 మ్యాచ్‌కు ముందు హ్యారీ కేన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టుకు వయాగ్రా(సిల్డెనాఫిల్) వాడేందుకు ప్రత్యేక అనుమతి లభించింది.
FIFA World Cup 2026 Why England Players Allowed To Take Viagra Before Mexico Match
FIFA World Cup 2026 : సాదారణంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో ద్రవ పదార్థాలు, ఎనర్జీ బార్లను తీసుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే.. ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ దశలో మెక్సికోతో జరిగే రౌండ్ ఆఫ్-16 మ్యాచ్‌కు ముందు హ్యారీ కేన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టుకు వయాగ్రా(సిల్డెనాఫిల్) వాడేందుకు ప్రత్యేక అనుమతి లభించింది.
జూలై 4న మెక్సికో సిటీలోని చారిత్రాత్మక ఎస్టాడియో అజ్టెకా వేదికగా మెక్సికో వర్సెస్ ఇంగ్లాడ్ మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియం సముద్ర మట్టానికి సుమారు 7,350 అడుగుల ఎత్తులో ఉంది. కాగా.. ఇంత ఎత్తైన స్టేడియంలో ఆడేటప్పుడు ఆటగాళ్లు త్వరగా అలసటకు గురయ్యే అవకాశం ఉంది. అందుకనే ఇంగ్లాండ్ మేనేజర్ థామస్ టూచెల్ తమ జట్టు ఆటగాళ్లు అవసరం అయితే వయాగ్రా వాడేందుకు అనుమతి పొందినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
AB De Villiers : భారత కోచ్ వ్యాఖ్యలతో విభేదించిన ఏబీ డివిలియర్స్.. ఇంకెంత కాలం ఇలా..
సాధారణంగా అంగస్తంభన సమస్యల చికిత్సకు ఉపయోగించే సిల్డెనాఫిల్ రక్తనాళాలను విస్తరించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అధిక ఎత్తులో ఆక్సిజన్ కొరత వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడంలో ఇది కొంతమేర సహాయపడవచ్చని భావిస్తున్నారు. అయితే ఇది ప్రతి ఆటగాడికి తప్పనిసరి కాదని, అవసరమని భావించిన వారు మాత్రమే వినియోగించే అవకాశముందని సమాచారం. మెక్సికో జట్టు ఈ మైదానంలో అత్యంత బలమైన రికార్డు కలిగి ఉండటంతో ఇంగ్లాండ్ అన్ని కోణాల్లో సిద్ధమవుతోంది.
వయాగ్రా విషయంలో వాడా నిబంధనలు ఎలా ఉన్నాయి?
ఇక ఈ అంశంపై ప్రపంచ యాంటీ డోపింగ్ సంస్థ వాడా (WADA) నిబంధనలు కూడా స్పష్టంగా ఉన్నాయి. వయాగ్రా (సిల్డెనాఫిల్) నిషేధిత ఔషధాల జాబితాలో లేదు. పోటీ సమయంలోనూ, పోటీ వెలుపలనూ దీన్ని వినియోగించడానికి అనుమతి ఉంది. గతంలో దీనిపై పలు పరిశోధనలు జరిగినప్పటికీ, సాధారణ పరిస్థితుల్లో లేదా సముద్ర మట్టానికి సమీప ప్రాంతాల్లో ఇది క్రీడా ప్రదర్శనను గణనీయంగా మెరుగుపరుస్తుందనే ఆధారాలు లేవని వాడా పేర్కొంది.
కాగా.. ఈ సీజన్లో మెక్సికో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అంతేకాకుండా అజ్టెకా మైదానంలో మెక్సికోకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఈ మైదానంలో 89 మ్యాచ్‌లు ఆడింది. రెండు అంటే రెండు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయింది. చివరిసారిగా 2013లోనే పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌కు ఇది కఠిన పరీక్ష కానుంది.
