FIFA World Cup 2026 : స్పెయిన్ సూపర్ షో.. ప్రపంచ ఫుట్‌బాల్ సింహాసనంపై మరోసారి అధిరోహణ! పనిచేయని మెస్సీ మాయ!
FIFA World Cup 2026 Winner Spain : ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ చరిత్ర సృష్టించింది. రెండోసారి ప్రపంచకప్ టైటిల్ సొంతం చేసుకుంది.
FIFA World Cup 2026 Winner Spain
FIFA World Cup 2026 Winner Spain : ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ చరిత్ర సృష్టించింది. దుర్భేద్యమైన డిఫెన్స్‌తోపాటు పదునైన ఎటాక్‌తో ఆధిపత్యం ప్రదర్శించిన స్పెయిన్.. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను మట్టికరిపించింది. అదనపు సమయంలో గోల్‌తో టోరెస్ స్పెయిన్ హీరోగా నిలిచాడు. స్టార్లు లేకున్నా సమష్టిగా సత్తా చాటుతూ ఫుట్‌బాల్ జగజ్జేతగా నిలిచిన స్పెయిన్.. కలల కప్పును రెండోసారి సగర్వంగా ముద్దాడింది.
España levanta la copa que los consagra campeones del mundial de la FIFA 2026 🇪🇸 pic.twitter.com/QBygrhacMM
— nacho con O (@NachoConO) July 19, 2026
భారత కాలమానం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 12.30గంటల సమయంలో అమెరికాలోని న్యూజెర్సీలో ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యార్ అర్జెంటీనా – స్పెయిన్ జట్ల మధ్య ప్రారంభమైంది. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మ్యాచ్ ముగిసింది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి స్పెయిన్ రెండోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్‌కు వెళ్లింది.
ఎక్స్ట్రా టైమ్ తొలి భాగంలో 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఫార్వర్డ్ ఫెర్రాన్ టొరెస్ చేసిన అద్భుత గోల్ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. పెడ్రో పోరో కుడివైపు నుంచి కొట్టి క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో నికో విలియమ్స్ హెడర్ షాట్ తో వెనక్కి పంపించాడు. అక్కడే ఉన్న ఫెరాన్ టోరెస్ అర్జెంటీనా గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. ఆ గోల్‌తో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లగా, మిగిలిన సమయంలో అర్జెంటీనా సమం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించినా స్పెయిన్ రక్షణను ఛేదించలేకపోయింది.
మ్యాచ్ మొత్తంలో అర్జెంటీనా గోల్‌కీపర్ ఎమిలియో మార్టీనెజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 12 సార్లు స్పెయిన్ ఆటగాళ్లు గోల్‌పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్లను నిలువరించాడు. అయితే 13వ ప్రయత్నంలో మాత్రం మార్టీనెజ్ ఏమీ చేయలేకపోయాడు. ఫైనల్ చేరే క్రమంలో 19 గోల్స్ కొట్టిన అర్జెంటీనా తుది పోరులో పూర్తిగా నిరాశపరిచింది. స్పెయిన్ ఫార్వర్డ్ ఆటగాళ్లను అడ్డుకోవడంలోనే అర్జెంటీనాకు సరిపోయింది.
39 ఏళ్ల లియోనెల్ మెస్సీకి ఇది వరల్డ్ కప్‌లో చివరి ఫైనల్‌గా భావిస్తున్నారు. 2022లో ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా వరుసగా రెండో టైటిల్ సాధించాలని ఆశించినా ఆ కల నెరవేరలేదు. మ్యాచ్ అనంతరం మెస్సీ భావోద్వేగానికి లోనవగా, స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్‌తో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు అభిమానులను కదిలించాయి. ఈ విజయంతో 2010 తర్వాత మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్, యూరో కప్ తర్వాత వరల్డ్ కప్‌ను కూడా గెలిచి ప్రపంచ ఫుట్‌బాల్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
