గంభీర్ జేమ్స్ బాండ్‌కు మించినోడిలా ఫీలవుతున్నాడు: అఫ్రీది

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది.. భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌పై చురకలు అంటించాడు. గంభీర్‌కు వ్యక్తిత్వమే లేదని, అతనేదో జేమ్స్ బాండ్.. డాన్ బ్రాడ్‌మన్‌లను దాటేసినట్లుగా ఫీలవుతున్నాడని వ్యాఖ్యానించాడు. తన ఆటో బయోగ్రఫీని ‘గేమ్ ఛేంజర్’ అనే పుస్తకరూపంలో అభిమానులు ముందుకు తీసుకువస్తున్న అఫ్రీది తన నిజమైన వయస్సు వెల్లడించడంతో పాటు జీవితంలో జరిగిన కీలక ఘట్టాల గురించి ప్రస్తావించాడు. 

‘కొన్ని సంఘటనలు పర్సనల్.. మరి కొన్ని ప్రొఫెషనల్. కానీ, గంభీర్ విషయంలో మాత్రం.. తనకు బీభత్సమైన అటిట్యూడ్. అదే తన సమస్య. ఓ క్యారెక్టర్ అంటూ లేకుండానే అంత పెద్ద క్రికెటర్‌గా స్థానం సంపాదించుకోగలిగాడు. రికార్డులు సాధించాల్సింది పోయి అటిట్యూడ్ తెచ్చిపెట్టుకున్నాడు. అతనేదో డాన్ బ్రాడ్‌మన్, జేమ్స్ బాండ్‌లను దాటిపోయినట్లు భావిస్తాడు. కరాచీలో ఇలాంటి వాళ్లను వేరే పేరుతో పిలుస్తాం. ఏదైనా అన్నప్పుడు కాంపిటీటివ్‌గా, అగ్రెసివ్‌గా తీసుకోవడమనేది సర్వసాధారణం. వాటిని పాజిటివ్‌గా తీసుకోవాలి. కానీ, గంభీర్ విషయంలో అలా కాదు’ అని అఫ్రీది విమర్శించాడు. 

అదే సందర్భంగా తన వయస్సుపై కూడా ఓ క్లారిటీ ఇచ్చేశాడు. 1975లోనే పుట్టినట్లుగా అందులో వెల్లడించాడు. 1996లో నైరోబీలో శ్రీలంకపై 37 బంతుల్లో సెంచరీతో వన్డే వరల్డ్‌ రికార్డు నెలకొల్పినప్పుడు తన వయస్సు 16 ఏళ్లు కాదనేది స్పష్టమయింది. ‘అప్పట్లో నా వయస్సు 16కాదు 19. నేను 1975లో పుట్టా. అధికారులు నా వయస్సును తప్పుగా నమోదు చేశారు’ అని ఆ పుస్తకంలో అఫ్రీది తెలిపాడు.