Gautam Gambhir comments after India lost 1st test match to south africa
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. 124 స్వల్ప లక్ష్యాన్ని టీమ్ఇండియా బ్యాటర్లు ఛేదించలేకపోయారు. స్పిన్‌ను ఆడడంలో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలం అయ్యారు. వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 31 పరుగులు) మినహా మిగిలిన బ్యాటర్లు ఎవ్వరు కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.
కాగా.. టీమ్ఇండియా ఘోర ఓటమిపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. తాము ఇలాంటి పిచ్‌ను కావాలనే కోరుకున్నామని చెప్పాడు. తాము అడినట్లుగా పిచ్‌ను క్యూరేటర్ తయారు చేసి ఇచ్చినట్లుగా తెలిపాడు. ఇందుకు తాము ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పాడు. అయితే.. ఈ పిచ్ పై తమ బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారన్నాడు.
అందువల్లే తాము ఓడిపోయినట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ పిచ్ పై 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించవచ్చునని తెలిపాడు. డిఫెన్స్, టెక్నిక్ ఉంటే పరుగులు చేయడం పెద్ద కష్టం కాదన్నాడు. సఫారీ కెప్టెన్ టెంబా బవుమా హాఫ్ సెంచరీ సాధించిన విషయాన్ని గంభీర్ గుర్తు చేశాడు.
అలాగే వాషింగ్టన్ సుందర్ పరుగులు చేశాడని, తమ ఓటమికి పిచ్‌ను నిందించలేమన్నాడు. ఇక ఈ పిచ్ పై ఎక్కువ వికెట్లు పేసర్లే తీశారని, కాబట్టి మరీ ఇది అంత టర్నింగ్ వికెట్ కాదన్నాడు. తాము గెలిచి ఉంటే పిచ్ గురించి ఎవ్వరూ మాట్లాడే వారు కాదన్నాడు.
గంభీర్ పై విమర్శల వర్షం..
గంభీర్ సూచన మేరకే క్యూరేటర్ పిచ్‌ను తయారు చేశాడని తెలియడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్‌ను ట్రోల్ చేస్తున్నారు. మన బ్యాటర్లు స్పిన్ ఆడడంలో పదే పదే విఫలం అవుతున్నప్పటికి ఇలాంటి పిచ్ లు తయారు చేయించడంలో అర్థమేలేదని అంటున్నారు.