Ravindra Jadeja : అందుకనే జడేజాను వదిలివేశాం.. కుండబద్దలు కొట్టిన సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్..
దాదాపు 12 సీజన్లుగా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja )ను సీఎస్‌కే వదులుకోవడం పట్ల ఆ జట్టు అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
CSK breaks silence after trading Ravindra Jadeja to Rajasthan Royals
Ravindra Jadeja : ఐపీఎల్ 2026 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రేడింగ్ విండో ద్వారా సంజూ శాంజన్‌ను తమ జట్టులోకి తీసుకున్న సీఎస్‌కే.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (Ravindra Jadeja), సామ్ కర్రన్‌లను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చింది.
ప్రస్తుత ఫీజు రూ.18 కోట్ల మొత్తానికే రాజస్థాన్ నుంచి సీఎస్‌కు సంజూ శాంసన్ వచ్చాడు. అయితే.. నాలుగు కోట్ల తక్కువ మొతానికి అంటే రూ.14 కోట్ల మొత్తానికే జడేజా సీఎస్‌కే నుంచి ఆర్ఆర్‌కు వెళ్లాడు. ఇక సామ్ క్రరన్ సైతం ప్రస్తుత ఫీజు రూ.2.4 కోట్ల మొతాన్నే అందుకోనున్నాడు.
రవీంద్ర జడేజాను ఎందుకు వదులుకున్నామంటే..?
దాదాపు 12 సీజన్లుగా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను సీఎస్‌కే వదులుకోవడం పట్ల ఆ జట్టు అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందించారు. ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికి కూడా జట్టు కూర్పును పరిగణలోకి తీసుకోవడం వల్ల తప్పలేదన్నాడు.
ఈ విషయమై ఇప్పటికే జట్టు మేనేజ్‌మెంట్.. జడేజాతో మాట్లాడిందని, అతడు కూడా తమ నిర్ణయం పట్ల సానుకూలంగా స్పందించాడని చెప్పుకొచ్చాడు. ఆ తరువాతే వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్)ను ముందుకు కొనసాగించినట్లుగా తెలిపారు.
‘ఈ నిర్ణయం జట్టు యాజమాన్యం తీసుకుంది. ఇది చాలా కఠినమైన నిర్ణయం. కొన్నేళ్లుగా సీఎస్‌కే విజయాల్లో కీలకమైన వ్యక్తి జడేజా. అతడిని పక్కనపెట్టడం అత్యంత కఠినమైన నిర్ణయాల్లో ఒకటి. జట్టును కూర్పు దృష్టిలో ఉంచుకునే ఇలా చేయాల్సి వచ్చింది.’ అని విశ్వనాథన్ అన్నారు.
“Decision taken on mutual agreement with Jadeja and Curran.” – CSK MD Kasi Viswanathan speaks on the trade. #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/8HAZrdIBJP
— Chennai Super Kings (@ChennaiIPL) November 15, 2025
ట్రేడింగ్ చేసుకునే ముందు సంబంధిత ఆటగాళ్లను సంప్రదించడం తప్పనిసరి అని, వారు ఒప్పుకున్న తరువాతనే దీనిపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నాడు. ఇక తాను జడేజాతో మాట్లాడినప్పుడు అతడు తన కెరీర్ చివరి దశలో ఉన్నాడనే విషయాన్ని అంగీకరించాడని, ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన జట్టుతో విరామం తీసుకుని వేరే చోటికి వెళ్లవచ్చని భావించాడని తెలిపాడు.
ప్రస్తుతం సీఎస్‌కే జట్టులో ఉన్న ఆటగాళ్లలో కొంత మంది కెరీర్ చివరి దశలో ఉన్నారన్న విషయాన్ని విశ్వనాథన్ అంగీకరించాడు. ఈ క్రమంలోనే రాబోయే రెండు సంవత్సరాలలో సీఎస్‌కే జట్టు పునర్‌నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జరగనున్న మినీ వేలంలో టీమ్ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు దొరకడం కష్టమని, అందుకనే ట్రేడింగ్ ద్వారా సంజూను దక్కించుకున్నామన్నాడు.
జడేజాను వదిలివేయడం వల్ల అభిమానులు బాధపడతారే విషయం తమకు తెలుసునని చెప్పుకొచ్చాడు. అయితే.. జట్టు కూర్పు, ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకునే సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపాడు. రాబోయే కొన్నేళ్లలో సీఎస్‌కే మరింత మెరుగ్గా రాణిస్తుందన్న ఆశాభావాన్ని విశ్వనాథన్ వ్యక్తం చేశారు.
