Courtesy BCCI
ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఆరో ట్రోఫీ దిశగా మరో అడుగుముందుకు వేసింది. ఐపీఎల్ 2025 సీజన్‌ను పేలవంగా ఆరంభించినా అద్భుతంగా పుంజుకుని ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ముంబై ఎలిమినేటర్‌లో అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఉత్కంఠపోరులో గుజరాత్ టైటాన్స్ పై 20 పరుగుల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌తో ముంబై తలపడనుంది.
ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ (81; 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు), బెయిర్‌స్టో (47; 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిశోర్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్ ఓ వికెట్ సాధించాడు.
ఆ తరువాత సాయి సుదర్శన్ (80; 49 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (48; 24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) గట్టిగానే పోరాడినా గుజరాత్ లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు. జస్‌ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్, మిచెల్ సాంట్నర్, అశ్వనీకుమార్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. బుమ్రా అసాధారణ ప్రదర్శన కారణంగానే ఓడిపోయే మ్యాచ్‌లో తాము విజయం సాధించామని చెప్పాడు. క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకునేందుకు అతడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టో ల పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు.
‘ఒకానొక సమయంలో మ్యాచ్ చేజారినట్లుగా అనిపించింది. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ కారణంగా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారినట్లు కనిపించింది. గుజరాత్ బ్యాటర్లు సైతం మంచి రిథమ్ అందుకున్నారు. ఆ సమయంలో ఒత్తిడికి లోనవ్వకుండా మా ప్లేయర్లకు అండగా నిలవాలనే విషయాన్ని గ్రహించాం.’ అని హార్దిక్ పాండ్యా అన్నాడు.
ఇక జానీ బ్యాటింగ్ చేసిన ఇన్నింగ్స్‌ను ఆరంభించిన తీరు అద్భుతం అని చెప్పాడు. తొలి మ్యాచ్‌లోనే అతడు అసాధారణ ప్రదర్శన చేశాడు. ఆరంభంలో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నప్పటికి రోహిత్ శర్మ సైతం చాలా బాగా ఆడాడని అన్నాడు. ఇక బౌలింగ్‌లో గ్లీసన్, బుమ్రా, అశ్వనీకుమార్ లతో పాటు ప్రతి ఒక్కరు రాణించారని చెప్పుకొచ్చాడు.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ చివరిలో తాను మరో రెండు భారీ షాట్లు ఆడాలని అనుకున్నట్లు హార్దిక్ తెలిపాడు. ఎందుకంటే ఆఖరిలో చేసే పరుగులు చాలా కీలంగా మారుతాయన్నాడు. మొత్తంగా బ్యాటింగ్‌లో మేం అనుకున్న విధంగా దూకుడుగానే ఆడాం అని హార్దిక్ అన్నాడు.
PBKS vs RCB : సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడిని స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. వీడియో వైరల్..
‘ఇక మ్యాచ్ చేజారిపోతుందని భావించినప్పుడు బుమ్రాతో బౌలింగ్ చేయించాలి. బుమ్రా లాంటి బౌలర్ జట్టులో ఉండడం ఎంతో అదృష్టం. ముంబై జట్టులో అత్యంత విలువైన ఆటగాడు అతడు. చివర్లో పరుగులు ఉంచితే కాపాడుకునే బౌలర్లు ఉన్నారని భావించడంతోనే బుమ్రాతో 18వ ఓవర్ వేయించాను. బుమ్రా చాలా చక్కగా వేయడంతో సాధించాల్సిన రన్‌రేట్ పెరిగింది. దీంతో మిగిలిన బౌలర్ల పని సులువైంది. ఇక క్వాలిఫయర్-2 మ్యాచ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం.’ అని పాండ్యా అన్నాడు.