Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయాలతో ప్రత్యర్థులకు దడ పుట్టించిన ముంబై ఇండియన్స్ కు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. ఓవైపు వర్షం, మరోవైపు తీవ్ర ఉత్కంఠ మధ్య వాంఖడే వేదికగా సాగిన మ్యాచ్‌లో ముంబై పై గుజరాత్ టైటాన్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో విల్ జాక్స్ (53; 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ (35; 24 బంతుల్లో 5 ఫోర్లు), కార్బిన్ బోష్ (27; 22 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. గుజరాత్ బౌలర్లలో సాయికిశోర్ రెండు వికెట్లు తీశాడు. సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, జెరాల్డ్ కోట్జీ తలా ఓ వికెట్ తీశారు.
వర్షం వల్ల రెండోసారి ఆట నిలిచే సమయానికి గుజరాత్ 18 ఓవర్లలో 132/6 స్కోరుతో నిలిచింది. వర్షం తగ్గిన తరువాత ఆటను ఒక ఓవర్‌కు కుదించి గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147గా నిర్ణయించారు. దీంతో ఆఖరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి 15 పరుగులు అవసరం అయ్యాయి. చాహర్ వేసిన ఈ ఓవర్‌లో టైటాన్స్ 15 పరుగులు చేసి ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, అశ్వనీకుమార్ లు తలా రెండు వికెట్లు తీశారు. దీపక్ చాహర్ ఓ వికెట్ పడగొట్టాడు.
గుజరాత్ టైటాన్స్‌పై ఓటమి అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. తాము అద్భుతంగా పోరాడామని చెప్పుకొచ్చాడు. ఓ జట్టుగా తాము ముందుకు సాగుతున్నామని తెలిపాడు. ఈ పిచ్ పై 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టం కాదన్నాడు. తాము మరో 25 పరుగులు తక్కువ చేసినట్లుగా తెలిపాడు. అయినప్పటికి బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారని మెచ్చుకున్నాడు.
ఆఖరి వరకు తీసుకువచ్చారంటే బౌలర్లకే క్రెడిట్ దక్కుతుందన్నాడు. ఇక క్యాచ్ లు మిస్ చేయడం పై మాట్లాడుతూ.. ఇది నిజంగా బాధాకరం అని, అయితే.. ఆ క్యాచ్ లు మిస్ చేయడం వల్ల పెద్దగా నష్టం వాటిల్లలేదన్నాడు.
బౌలర్లు నోబాల్స్ వేయడం పై స్పందిస్తూ.. ‘చివరి ఓవర్లలో నో బాల్ గురించి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. టీ20 క్రికెట్‌లో నో బాల్స్ వేయడం మరణశిక్ష విధించదగిన నేరంగా నేను భావిస్తా. ఎందుకంటే నో బాల్స్ ద్వారా వచ్చే పరుగులు ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి.’ అని హార్దిక్ అన్నాడు.
ఇక తమ ప్లేయర్లు మైదానంలో 120 శాతం ప్రదర్శన ఇచ్చారన్నాడు. ఇందుకు సంతోషంగా ఉందన్నాడు. మ్యాచ్‌ను వదిలివేయకుండా ఆఖరి వరకు పోరాడడం బాగుందన్నాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో మైదానం తడిగా లేదని చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌ల్లో పలుమార్లు వర్షం రావడంతో ఫీల్డింగ్ చేయడం కాస్త కష్టంగా మారిందన్నాడు.
RCB : ఇదెక్కడి ట్విస్ట్ రా అయ్యా.. ఇలా జరిగితే ఐపీఎల్ 2025 నుంచి ఆర్‌సీబీ ఔట్?