RCB : ఇదెక్కడి ట్విస్ట్ రా అయ్యా.. ఇలా జరిగితే ఐపీఎల్ 2025 నుంచి ఆర్‌సీబీ ఔట్?
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క జట్టు కూడా అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయాయి.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో లీగ్ దశ దాదాపుగా ఆఖరి అంకానికి చేరుకుంది. అయినప్పటికి ప్లేఆఫ్స్‌కు అధికారికంగా ఒక్కజట్టు కూడా ఎంట్రీ సాధించలేకపోయింది. ఇప్నటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించాయి. మిగిలిన ఏడు జట్లు కూడా ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి.
ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అయితే.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వార్త హల్ చేస్తోంది. ఒకవేళ అలాగే జరిగితే మాత్రం టేబుల్ టాపర్‌గా ఉన్న ఆర్‌సీబీ సైతం ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టకుండానే ఇంటి ముఖం పట్లే అవకాశాలు ఉన్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీ అదరగొడుతోంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 16 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్ +0.482గా ఉంది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న సంగతి తెలిసిందే..
అదే జరిగితే.. ఆర్‌సీబీ ఔట్..
ముంబై ఇండియన్స్ తమ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడిస్తే అప్పుడు ఆ జట్టు పాయింట్ల సంఖ్య 20కి చేరుకుంటుంది. ఈజీగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. అలా కాకుండా పంజాబ్ చేతిలో ఓడిపోయినా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా కూడా 18 పాయింట్లతో ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.
అటు పంజాబ్ కింగ్స్ తమ చివరి 3 మ్యాచ్‌ల్లో.. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌ను ఓడిస్తే అప్పుడు 19 పాయింట్లతో ప్లేఆఫ్‌లో అడుగుపెడుతుంది.
ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్.. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించినట్లయితే మొత్తం 18 పాయింట్లతో ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తమ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులను ఓడించినట్లయితే ఆ జట్టు మొత్తం 17 పాయింట్లతో ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది.
అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో.. లక్నో, సన్‌రైజర్స్, కేకేఆర్ చేతిలో ఓడిపోతే అప్పడు 16 పాయింట్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమిస్తుంది. ముంబై, పంజాబ్, గుజరాత్, కేకేఆర్‌కు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.
కాబట్టి.. ఆర్‌సీబీకి తమ తదుపరి మూడు మ్యాచ్‌లు ఎంతో కీలకం. ఇందులో కనీసం ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కూడా ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ అడుగుపెడుతుంది. అయితే.. టాప్-2లో నిలవాలంటే మాత్రం అన్నింటిలో గెలవాల్సిన అవసరం ఉంది.