Mahela Jayawardene-Rohit Sharma : ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ.. ఎట్టకేలకు నోరు విప్పిన ముంబై కోచ్ జయవర్ధనే..
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ అదరగొడుతోంది.

Mahela Jayawardene finally reveals real reason why Rohit Sharma isnt fielding in IPL 2025
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ అదరగొడుతోంది. ఇప్పటి వరకు ముంబై 11 మ్యాచ్‌లు ఆడగా 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 14 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +1.274గా ఉంది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్‌లో కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గానే ఆడుతున్నాడు. అతడిని బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కావాలనే హార్దిక్ ఇలా చేస్తున్నాడని కొందరు అభిమానులు మండిపడుతున్నారు.
ఎట్టకేలకు ఈ విషయం పై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే స్పందించాడు. రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడం వెనుక ఉన్న అసలైన కారణాన్ని అతడు తెలియజేశాడు. వాస్తవానికి రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ ఆడించాలనే నిర్ణయం సీజన్ ఆరంభానికి ముందు తీసుకోలేదన్నాడు. హిట్‌మ్యాన్ చిన్నపాటి గాయంతో ఇబ్బంది పడుతున్నాడని చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అతడు దీంతో ఇబ్బంది పడుతున్నాడని తెలిపాడు. ఈ క్రమంలోనే అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పాడు.
కొన్ని మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేశాడనే విషయాన్ని గుర్తు చేశాడు. రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడడంతో ముంబైకి ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ లభిస్తుందన్నాడు. కొన్ని మైదానాల్లో బౌండరీల వద్ద వేగంగా కదలగల ఆటగాళ్లు అవసరం అని, రోహిత్ శర్మ బ్యాటింగ్ జట్టుకు ఎంతో అవసరం అని, అందుకనే అతడిపై అనవసర ఒత్తిడి తీసుకురావద్దనే ఇంపాక్ట్ సబ్‌గా ఆడిస్తున్నామని చెప్పుకొచ్చాడు.
ఇక రోహిత్ శర్మ మైదానంలో లేకున్నా సరే.. జట్టుకు కావాల్సిన సహకారం అందిస్తున్నాడని తెలిపాడు. డగౌట్‌లో ఉంటూ టైమ్ ఔట్ సమయంలో తన విలువైన సలహాలు అందిస్తున్నాడని, జట్టు సమావేశాల్లో చురుకుగా పాల్గొంటున్నాడని తెలిపాడు.
కాగా.. జయవర్ధనే వ్యాఖ్యలతో ప్రస్తుతం భారత అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది. హిట్‌మ్యాన్ గాయంతో బాధపడుతుండడంతో అతడు ఇంగ్లాండ్ పర్యటనకు వెలుతాడా ? లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.