IND vs AFG : ఆ ఒక్క తప్పిదం వల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ కామెంట్స్..
మూడో వన్డేలో ఓటమిపై (IND vs AFG) అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ స్పందించాడు.
Hashmatullah Shahidi comments after Afghanistan lost match to india in 3rd ODI
- మూడో వన్డేలోనూ భారత్ చేతిలో ఓటమి
- స్పందించిన అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ
- తొలి 10 ఓవర్లలోనే కీలక వికెట్లు కోల్పోయాం
IND vs AFG : బ్యాటింగ్ వైఫల్యమే తమ జట్టు కొంపముంచిందని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తెలిపాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ తొలి 10 ఓవర్లలో తాము కీలక వికెట్లు కోల్పోవడంతోనే మ్యాచ్‌లో వెనుకబడిపోయామని, తద్వారా భారీ స్కోరు సాధించలేకపోయామని చెప్పుకొచ్చాడు. శనివారం చెపాక్ వేదికగా జరిగిన మూడో వన్డేలో అఫ్గాన్ ఓడిపోయింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది.
ఈ మ్యాచ్‌లో హష్మతుల్లా షాహిదీ (102 నాటౌట్; 131 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయగా, అజ్మతుల్లా ఒమర్జాయ్ (50; 56 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ ఐదు వికెట్లు పడగొట్టాడు. గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే లు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం 219 పరుగుల లక్ష్యాన్ని భారత్ 28.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (110 నాటౌట్; 86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, రోహిత్ శర్మ (79; 69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.
అదే మా కొంపముంచింది
ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ స్పందించాడు. మ్యాచ్ ప్రారంభంలో తొలి 10 ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారన్నాడు. దీంతో తాము వరుసగా కీలక వికెట్లు కోల్పోయామని, తీవ్ర ఒత్తిడితో పడిపోయామని చెప్పుకొచ్చాడు. ప్రారంభంలోనే వికెట్లు కోల్పోవడం జట్టు స్కోరింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందన్నాడు.
Team India : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ నుంచి హార్దిక్ ఔట్! కోహ్లీ భవిష్యత్ తేలేది ఆరోజే?
తాను.. అజ్మత్ తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో తిరిగి పోటీలోకి వచ్చామన్నాడు. కానీ తమ భాగస్వామ్యం విడిపోయిన వెంటనే మరోసారి వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్ చివరిలోనూ ఆశించిన స్థాయిలో పరుగులు సాధించలేకపోయామని చెప్పుకొచ్చాడు. దీంతో తాము తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చిందన్నాడు.
ఇక వన్డేల్లో తాను తొలి సెంచరీ సాధించడం పై ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 95 మ్యాచ్‌ల తరువాత మూడు అంకెల స్కోరు సాధించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. ఇది ఆ దేవుడి కృపగా భావిస్తున్నానని, ఇకపై కూడా తన దేశం కోసం మరిన్ని సెంచరీలు సాధించేందుకు కృషి చేస్తానని అన్నాడు. ఇక మ్యాచ్ సమయంలో తీవ్రమైన ఎండ కారణంగా కండరాలు పట్టేశాయని, అయితే ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నాననని అన్నాడు.
జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ భారత జట్టుతో భారత్‌లో ఆడటం చాలా కష్టమని అంగీకరించాడు. ఈ సిరీస్‌లో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపాడు. గత ఎనిమిది నెలలుగా జట్టు వన్డే క్రికెట్‌కు దూరంగా ఉండటం కూడా ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. తదుపరి ఐర్లాండ్‌తో సిరీస్ ఆడనున్నామని, తప్పిదాలను సరిదిద్దుకుని ముందుకు సాగుతామన్న ధీమాను వ్యక్తం చేశాడు.
