పసికూనలు కాదు.. పట్టుబట్టి నిలబడే తోప్‌లు.. టీ20 వరల్డ్ కప్‌లో ఆప్ఘానిస్తాన్ టీమ్ సునామీ

ఆకలి, అవమానాలు, ఆర్థిక ఆటుపోట్లు దాటిన తర్వాత సాధించే విజయం మరేది ఇవ్వదని.. తమ చేతలతోనే గెలుపును సాధించి..

పసికూనలు కాదు.. పట్టుబట్టి నిలబడే తోప్‌లు.. టీ20 వరల్డ్ కప్‌లో ఆప్ఘానిస్తాన్ టీమ్ సునామీ

how afghanistan qualify for semi final

Updated On : June 26, 2024 / 10:37 AM IST

Afghanistan Cricket Team Success: గెలుపు ఇచ్చే ఆనందం మరేది ఇవ్వదు. కానీ గెలిచే వరకు పోరాడాలి. ఆ పోరు ముందు ప్రత్యర్థే తలవంచాలి. అలాంటి పోరు చేసి నిలిచి గెలుస్తుంది ఆప్ఘానిస్తాన్ టీమ్. గెలుస్తామన్న నమ్మకం ఉంటే.. విజయం మనదే కావాలనే కసి ఉంటే.. ఆకలినైనా, అవమానాన్ని అయినా.. పేదరికాన్ని కూడా భరించొచ్చు. ఇది మాటల్లోనే కాదు చేతల్లోనూ నిరూపిస్తోంది ఆప్ఘానిస్తాన్ టీమ్. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కంటే భయంకరంగా ఉంటుందని చెప్పకనే చెప్తోంది. ఆకలి, అవమానాలు, ఆర్థిక ఆటుపోట్లు దాటిన తర్వాత సాధించే విజయం మరేది ఇవ్వదని.. తమ చేతలతోనే గెలుపును సాధించి.. ఆకాశమంత ఆనందం.. మాటల్లో చెప్పలేనంత భావోద్వేగంతో ఆప్ఘానిస్తాన్ ప్లేయర్లు ఆనంద భాష్పాల్లో మునిగి తేలుతున్నారు.

తోప్ టీమ్స్‌ను మట్టి కరిపించి..
ఎలాంటి అంచనాలు లేకుండా ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో మోత మోగిస్తున్నారు ఆప్ఘానిస్తాన్ ప్లేయర్లు. అసలు టీమే ఉంటుందా లేదా అన్న అనుమానాల నుంచి ఏకంగా హిస్టరీ క్రియేట్ చేసేస్తున్నారు. పొట్టి క్రికెట్ కప్‌ పోరులో వరుస విజయాలతో హోరెత్తిస్తున్నారు ఆప్ఘాన్ క్రికెట్ ప్లేయర్లు. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా తోప్ జట్లని చెప్పుకునే ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌తో పాటు పెద్దపెద్ద టీమ్స్‌ను మట్టి కరిపించి చరిత్ర సృష్టిస్తోంది.

ప్రస్తుతం జరుగుతోన్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆప్ఘానిస్తాన్ టీమ్ అన్ని విభాగాల్లో చెలరేగిపోతుంది. మెగా టోర్నీలో ఆ టీమ్ సూపర్‌-8కు అర్హత సాధించడమే కాదు ఏకంగా సెమీస్‌కు చేరింది. బౌలింగ్, బ్యాటింగ్ అన్నమాటే లేదు. అన్ని ఫార్మాట్లలో ఓ రేంజ్ పర్ఫామెన్స్‌తో పిచ్చేక్కిస్తున్నారు ఆప్ఘాన్ ప్లేయర్లు. బౌలింగ్‌లో అయితే ఆ టీమ్‌కు తిరుగులేకుండా పోయింది. బౌలర్లు ప్రత్యర్థులను కట్టడి చేయడంలో ఫుల్ సక్సెస్ అవుతున్నారు.

ఆప్ఘాన్ టీమ్ బౌలింగ్‌ ఫార్మాట్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఫస్ట్ మ్యాచ్‌లో ఉగాండను 58 పరుగులకే ఆలౌట్‌ చేసిన ఆఫ్ఘాన్ బౌలర్లు.. ఆ తర్వాతి మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌ను 75 పరుగులకు.. పపువా న్యూగినియాను 95 పరుగులకు కుప్పకూల్చారు. ఆప్ఘాన్ బౌలర్లు ఈ తరహాలో చెలరేగడం వెనుక ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ డ్వేన్‌ బ్రావో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ వరల్డ్‌కప్‌తో ఆప్ఘాన్ బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రావో ఆ జట్టు సాధిస్తున్న ప్రతి విజయంలో తనదైన మార్కును చూపుతున్నాడు. బ్రావో ఆధ్వర్యంలో మీడియం ఫాస్ట్‌ బౌలర్‌ ఫజల్‌ హక్‌ ఫారూఖీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.

గ్రూప్‌ దశలో మరో మ్యాచ్‌ మిగిలుండగానే సూపర్‌-8కు అర్హత సాధించింది. ఆప్ఘానిస్తాన్. సూపర్‌-8లో భారత్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓడినా.. అన్ని ఫార్మాట్లలో స్ట్రాంగ్‌గా ఉండే ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. బంగ్లాదేశ్‌పై కూడా విజయం సాధించి.. క్రికెట్ ఫ్యాన్స్‌లో అంచనాలను పెంచేసింది ఆప్ఘానిస్తాన్ టీమ్.

ఒకప్పటి క్రికెట్‌ పసికూన ఆప్ఘానిస్తాన్ ఇప్పుడు వరల్ట్ టాప్ టీమ్‌లల్లో ఒకటిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్‌కప్‌-2024 బరిలోకి దిగిన ఆ జట్టు..న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ లాంటి టాప్ టీమ్‌లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌కు చేరింది.

బంగ్లాను మట్టికరిపించిన ఆప్ఘాన్లు.. ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించి, క్రికెట్‌ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశారు. బంగ్లాపై గెలుపు తర్వాత ఆప్ఘానిస్తాన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లంతా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. కోచ్‌ జోనాథన్‌ ట్రాట్‌, బౌలింగ్‌ కోచ్‌ డ్వేన్‌ బ్రావో కూడా ఆప్ఘాన్ల గెలుపు సంబరాల్లో భాగమయ్యారు.

Also Read: చ‌రిత్ర సృష్టించిన ర‌షీద్ ఖాన్‌.. టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు..

ఆప్ఘానిస్తాన్ క్రికెట్‌ చరిత్రలో ఇది అద్భుత సందర్భాన్ని ప్రతి క్రికెట్‌ ప్రేమికుడు సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఆప్ఘాన్ పౌరుల సంబరాలు, భావోద్వేగాలు మాటల్లో వర్ణించలేం. ఆప్ఘానిస్తాన్ నగర వీధులు తమ దేశ ఆటగాళ్ల నామస్మరణతో మార్మోగాయి. అఫ్గాన్లు తమకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా ఇంతలా సంబురాలు చేసుకుని ఉండరు. కాబుల్‌ సహా దేశంలోని ప్రతి నగరంలో జనాలు రోడ్లపైకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

సెమీస్‌లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది ఆప్ఘానిస్తాన్. ఇందులో సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు సూపర్-8లో మూడు మ్యాచ్‌లు ఆడి మూడింట్లో విజయం సాధించింది. ఆరు పాయింట్లతో గ్రూప్-బిలో టాప్‌లో కొనసాగుతోంది. ఇక క్రికెట్ పసికూనగా పేరున్న ఆప్ఘాన్ వరుస విజయాలతో హోరెత్తిస్తుంది. సూపర్-8లో మూడు మ్యాచ్‌లు ఆడి రెండింట్లో గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. అది భారత్ చేతిలోనే. అయినా 4పాయింట్లతో గ్రూప్-ఎలో సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది ఆప్ఘాన్ టీమ్.

గ్రూప్-ఎ నుంచి టీమిండియా, ఆప్ఘానిస్తాన్ రెండు టీమ్‌లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. టీమ్-బిలో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ సెమీస్ రేసులో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని దక్షిణాప్రికాతో ఆప్ఘాన్ టీమ్ తలపడనుంది. గ్రూప్-A, గ్రూప్-Bలో సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు ఫైనల్ పోరులో విజేత ఎవరో తేల్చుకోనున్నాయి.