Rashid Khan : చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్కడు..
అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు.

Afghanistan spinner Rashid Khan
Afghanistan spinner Rashid Khan : అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ నాలుగు ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ను అధిగమించాడు. షకీబ్ ఎనిమిది సార్లు నాలుగు వికెట్లు ప్రదర్శన చేయగా రషీద్ తాజా ప్రదర్శనతో 9 సార్లు ఈ ఘనత సాధించాడు. వీరిద్దరి తరువాత ఉగాండా బౌలర్ హెన్రీ సెన్యోడా ఏడు సార్లు ఈ ప్రదర్శన నమోదు చేసి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు 4 వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్లు..
రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్) – 9 సార్లు
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 8 సార్లు
హెన్రీ సెన్యోడా (ఉగాండా) – 7 సార్లు
ఇక అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్ (55 బంతుల్లో 43) టాప్ స్కోరర్. అతడితోపాటు ఇబ్రహీం జద్రాన్ (18), రషీద్ ఖాన్ (19 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్ మూడు వికెట్లు, ముస్తాఫిజుర్, తస్కిన్ అహ్మద్ లు చెరో వికెట్ సాధించారు.
అనంతరం బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. బంగ్లా లక్ష్యాన్ని 114 పరుగులు నిర్ణయించారు. అఫ్గాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.