ఇంగ్లాండ్‌తో సెమీస్ మ్యాచ్.. వర్షం పడి మ్యాచ్ రద్దైతే.. టీమ్ఇండియాకు గోల్డెన్ ఛాన్స్..
సెమీఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగాండ్‌తో భారత్ తలపడనుంది.

What Happens If India vs England T20 World Cup 2024 Semifinal Is Washed Out
IND vs ENG Semi Final : టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగాండ్‌తో భారత్ తలపడనుంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో గురువారం (జూన్ 27న) భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..? అన్నది ఇప్పుడు చూద్దాం..
టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచులకు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో కొన్ని మ్యాచులు రద్దు కాగా.. మరికొన్ని మ్యాచుల్లో ఓవర్ల సంఖ్యను కుదించాల్సి వచ్చింది. మంగళవారం అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి గురువారం గయానాలో వాతావరణం ఎలా ఉంటుందని అన్న దానిపై పడింది.
అక్యూ వెదర్ ప్రకారం.. గురువారం గయానాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం 88 శాతంగా ఉన్నట్లు తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు సూచించింది. కాగా.. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ కు ఐసీసీ రిజర్వ్ డేను ప్రకటించలేదు. వర్షం అంతరాయం కలిగిస్తే.. 4 గంటల 10 నిమిషాలు అంటే 250 నిమిషాల అదనపు సమయాన్ని ఇచ్చింది. ఈ సమయంలోగా మ్యాచ్ జరగకపోతే రద్దు చేస్తారు.
మ్యాచ్ రద్దు అయితే.. ఐసీసీ పేర్కొన్న నిబంధనల ప్రకారం.. సెమీస్‌కు చేరిన రెండు జట్లలో సూపర్ 8 స్టేజీలో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. సూపర్ 8 దశలో భారత్ తన గ్రూపు నుంచి అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లాండ్ మాత్రం గ్రూప్ బిలో రెండవ స్థానంలో నిలిచింది. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే టీమ్ఇండియా ఫైనల్ చేరుకుంటుంది. ఈ విషయం తెలిసిన కొందరు భారత అభిమానులు వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావాలని భారత్ ఫైనల్ చేరుకోవాలని ఆశిస్తున్నారు.