శుభ్‌మన్ గిల్ కెప్టెన్ అయ్యాక.. అజిత్ అగార్కర్, గంభీర్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఆసక్తికర విషయాలు చెప్పిన గిల్
ఇన్ని సవాళ్లు ఉన్నా, గిల్ తన విజన్‌పై చాలా స్పష్టంగా ఉన్నాడు.

Shubman Gill (Image:ANI)
భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ వంటి దిగ్గజాలు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుపై మరింత దృష్టి పెట్టింది. ఈ కొత్త శకానికి సారథిగా యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌ను భారత 37వ టెస్టు కెప్టెన్‌గా నియమించింది. ఇది కేవలం ఒక నియామకం కాదు, భారత క్రికెట్ భవిష్యత్తుకు వేస్తున్న పునాది. తాజాగా గిల్ ఓ ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపాడు.
గౌతీ భయ్యా భరోసా ఇచ్చారు: గిల్
కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్ తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశాడు. స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఈ విషయంపై నేను గౌతీ భయ్యా (గంభీర్), అజిత్ భయ్యా (అగార్కర్)తో చాలాసార్లు మాట్లాడాను. వాళ్లిద్దరూ ఒకే మాట చెప్పారు. నిన్ను నువ్వు స్వేచ్ఛగా ఉండేలా చేసుకో, ఎలాంటి ఒత్తిడి ఉండదు అని అన్నారు.
నేను చేయలేని పనుల గురించి వాళ్లు ఏమీ ఎక్పక్టేషన్స్ పెట్టుకోవడం లేదు. అందువల్ల వాళ్లవైపు నుంచి నాకు ఒత్తిడి అనేదే లేదు. కానీ, మన మీద మనం కొన్ని ఎక్పక్టేషన్స్ పెట్టుకుంటాం కదా. ఒక నాయకుడిగా, ఆటగాడిగా నా పట్ల నాకు నేను పెట్టుకునే అంచనాలు నాలో ఉన్నాయని చెప్పొచ్చు. వాళ్లవైపు నుంచి మాత్రం అలాంటి ఎలాంటి అంచనాలు లేవు” అని గిల్ తెలిపాడు.
ముందున్నది ముళ్లబాటే.. భారీ సవాళ్లు
గిల్ ముందు హిమాలయమంత సవాళ్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ చివరిసారిగా 2007లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో టెస్టు సిరీస్ గెలిచింది. ఆ రికార్డును బద్దలుకొట్టాల్సి ఉంది.
దిగ్గజాలు లేని లోటు కనపడకుండా జట్టును నడిపించాలి. రోహిత్, కోహ్లీ, అశ్విన్ వంటి మ్యాచ్ విన్నర్లు లేకుండా యువ జట్టును విజయ తీరాలకు చేర్చాలి. శుభ్‌మన్‌కు అనుభవం తక్కువే. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లినా.. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కెప్టెన్సీ అనుభవం మాత్రం పరిమితమే.
నా లక్ష్యం ట్రోఫీలు కాదు: గిల్ కొత్త విజన్
ఇన్ని సవాళ్లు ఉన్నా, గిల్ తన విజన్‌పై చాలా స్పష్టంగా ఉన్నాడు. ట్రోఫీల కంటే జట్టులో ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడమే తన ప్రథమ కర్తవ్యమని అంటున్నాడు.
“డెస్సింగ్ రూమ్‌లో కలిసిమెలసి ఉండాలి. ఆటగాళ్లతో స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలి. అప్పుడే వారు భయం లేకుండా ఆడగలరు” అని గిల్ వెల్లడించాడు. ఇది గతంలో ద్రావిడ్-రోహిత్ అనుసరించిన వ్యూహాన్ని గుర్తుచేస్తోంది.
బుమ్రా, కేఎల్ రాహుల్, జడేజా వంటి సీనియర్ల మద్దతుతో, గంభీర్ వ్యూహరచనతో శుభ్‌మన్ గిల్ భారత క్రికెట్‌ను ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ యువ కెప్టెన్, యువ జట్టుతో కలిసి కొత్త చరిత్ర సృష్టించగలడా? సమాధానం కాలమే చెప్పాలి.