I think Sudarshan and Jaiswal will open the batting in England Says Ricky Ponting
భారత టెస్టు క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని యువ భారత్ ఎలా ఆడుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెగ్యులర్ ఓపెనర్ అయిన రోహిత్ శర్మ, నాలుగో స్థానంలో బరిలోకి దిగే కోహ్లీ స్థానాల్లో టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ ఎవరిని ఆడిస్తుందోననే ఉత్కంఠ అందరిలో ఉంది.
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉందని, సాయి సుదర్శన్ మూడో స్థానంలో, శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తారని ఇప్పటి వరకు పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాత్రం దీనికి చాలా భిన్నంగా స్పందించాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్ లు ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. ఎందుకంటే సాయి సుదర్శన్ క్లాస్ ప్లేయర్ అని చెప్పుకొచ్చాడు. అతడి టెక్నిక్ అద్భుతం అని, సాంకేతికంగా చూసుకుంటే అతడు టెస్టు క్రికెట్‌లో చాలా బాగా రాణించగలడని తాను భావిస్తున్నట్లు తెలిపాడు.
సాయి, జైస్వాల్‌లు యువ ఆటగాళ్లు కాబట్టి మూడో స్థానంలో కాస్త అనుభవం ఉన్న ఆటగాడిగా తీసుకోవాలని చెప్పాడు. కేఎల్ రాహుల్ లేదా కరుణ్ నాయర్‌లలో ఎవరో ఒకరు మూడో స్థానంలో వస్తే బాగుంటుందన్నాడు. ఇక కెప్టెన్ గిల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగాలని, ఆ స్థానంలో అయితే.. అప్పటికే మ్యాచ్ పై ఓ అవగాహన అతడికి వస్తుందన్నాడు.
మొత్తంగా ఇంగ్లాండ్ పర్యటనలో తొలి ఐదు స్థానాల్లో సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, కరుణ్ నాయర్‌లు ఆడొచ్చునని పాంటింగ్ తెలిపాడు.
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు గిల్ మీడియాతో మాట్లాడుతూ.. తాము బ్యాటింగ్ ఆర్డర్ పై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని, జూన్ 13న ప్రారంభమయ్యే భారత ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ తర్వాత జట్టు యాజమాన్యం బ్యాటింగ్ ఆర్డర్‌పై నిర్ణయం తీసుకుంటుందని సూచించాడు.