Gautam Gambhir-Karun Nair : కౌంటీలు ఆడడంతోనే కరుణ్ నాయర్‌ను తీసుకున్నారా? గంభీర్ అసలు ఏమన్నాడు ?
ఇంగ్లాండ్ పర్యటనలో కరుణ్ నాయర్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు

Gautam Gambhir has thrown his support behind Karun Nair
ఇంగ్లాండ్ పర్యటనలో కరుణ్ నాయర్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ఇంగ్లాండ్ పర్యటకు వెళ్లే ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కరణ్ నాయర్ గురించి గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో కరుణ్ నాయర్ ఆడాడని, అక్కడి పరిస్థితులపై అతడికి పూర్తి అవగాహన ఉందన్నాడు. ఈ నేపథ్యంలో అతడి అనుభవం భారత జట్టుకు ఉపయోగపడుతుందని చెప్పాడు. ఈ పర్యటనలో అతడు కీలకం కానున్నాడని తెలిపాడు. అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నన్నని రోజులు ఆటగాళ్ల కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పాడు. ఒకటి లేదా రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ప్రదర్శన చూసి ఆటగాళ్ల మీద ఓ అంచనాకు రామన్నాడు. నిలకడగా పరుగులు సాధిస్తేనే అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించగలరని తెలిపాడు.
చివరి సారి 2017లో..
టీమ్ఇండియా తరుపున చివరిసారిగా కరుణ్ నాయర్ 2017లో టెస్టు మ్యాచ్ ఆడాడు. కాగా.. దేశవాళ్లీలో నిలకడగా రాణించాడు. పరుగులు వరద పారించాడు. అదే సమయంలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పారు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌లో రాణించడం,ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో సత్తాచాటిన కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ పర్యటనలో కీలకం అవుతాడని భావించి సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు.
ఇదిలాఉంటే.. ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన అనధికార తొలి టెస్టు మ్యాచ్‌లో కరుణ్ నాయర్ ద్విశకతం చేశాడు.