ఆస్ట్రేలియాను ఓడించాలంటే టీమిండియాలో ఆ ఇద్దరు ప్లేయర్లు కీలకం.. ఆసీస్ మాజీ కెప్టెన్ చాపెల్
ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా జట్టును ఓడించాలంటే భారత్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు కీలకం అని ఇయాన్ చాపెల్ అన్నారు

Former Australia captain Ian Chappell
Ian chappell : బంగ్లాదేశ్ జట్టుపై భారీ విజయంతో టీమిండియా జోష్ మీదుంది. బంగ్లాతో రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అద్భుత ఆటతీరును కనబర్చారు. దీంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ స్టాండింగ్స్ లో భారత్ ముందు వరుసలో ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ లో బెర్త్ ఖరారు చేసుకోవాలంటే టీమిండియా ఆడబోయే టెస్టుల్లో కనీసం నాలుగు టెస్టులైనా విజయం సాధించాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ రెండు టెస్టుల్లో ఒక టెస్టు పూర్తి కాగా.. మరో టెస్ట్ మ్యాచ్ ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుంది. ఆ తరువాత స్వదేశంలోనే న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టులు ఆడనుంది. ఆ తరువాత బోర్డర్ – గవాస్కర్ ట్రోపీలో భాగంగా నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ప్రారంభమవుతుంది.
Also Read : WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే.. ఆ రెండు జట్లపై పైచేయి సాధించాల్సిందే
ప్రముఖ ఇంగ్లీష్ వెబ్ సైట్ లో రాసిన కాలమ్ లో.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ కీలక విషయాన్ని ప్రస్తావించారు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో టెస్టు మ్యాచ్ ల ద్వారా ఆస్ట్రేలియా సిరీస్ కు భారత్ సిద్ధమవుతోంది. అయితే, ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా జట్టును ఓడించాలంటే భారత్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు కీలకం అని ఇయాన్ చాపెల్ అన్నారు. టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాలు ఆసీస్ జట్టుపై భారత్ ఆధిపత్యం సాధించడంలో కీలకంగా వ్యవహరిస్తారని చెప్పారు. భారత్ జట్టు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లపై టెస్ట్ సిరీస్ లను గెలుచుకోవటంతో పాటు ఆటగాళ్ల ఫిట్ నెస్ కూడా చూసుకోవాలని, ముఖ్యంగా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ నాటికి పంత్, బుమ్రాలు ఫిట్ గా ఉండేలా చూసుకోవాలని చాపెల్ అన్నారు.
బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో పంత్ సెంచరీ చేశాడు. అయితే, పంత్ కు ఆస్ట్రేలియాపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2021 ఆస్ట్రేలియన్ సిరీస్ లో రిషబ్ పంత్ సిడ్నీ, బ్రిస్బేన్ లలో తన అద్భుత ఆటతీరును కనబర్చాడు. మరోవైపు జస్ర్పీత్ బుమ్రా మంచి ఫామ్ లో ఉన్నాడు. వీరిద్దరిపై ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్ నాటికి గాయాలు పాలవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలని టీమిండియాకు చాపెల్ సూచించాడు.
నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోపీలో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
నవంబర్ 22 – 26 వరకు పెర్త్ లో తొలి టెస్ట్.
డిసెంబర్ 6 -10 వరకు ఆడిలైడ్ ఓవల్ లో రెండో టెస్ట్.
డిసెంబర్ 14 -18 వరకు బ్రిస్బేన్ లో మూడో టెస్ట్
డిసెంబర్ 26 – 30 వరకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో నాల్గో టెస్ట్.
జనవరి 3 – 7 వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఐదో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.