WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే.. ఆ రెండు జట్లపై పైచేయి సాధించాల్సిందే

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టును ఓడించి ..

WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే.. ఆ రెండు జట్లపై పైచేయి సాధించాల్సిందే

Team india

Updated On : September 23, 2024 / 12:53 PM IST

World Test Championship Final : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టును ఓడించి వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో స్థానం సంపాదించే అవకాశాలను రోహిత్ శర్మ ఆధ్వర్యంలోని టీమిండియా గణనీయంగా పెంచుకుంది. బంగ్లాదేశ్ జట్టుపై విజయం తరువాత టీమిండియా 86 రేటింగ్ పాయింట్లు సాధించగా.. జట్టు విజయాల శాతం 71.67గా ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాతో మ్యాచ్ కు ముందు కూడా టీమిండియా అగ్రస్థానంలోనే ఉంది.. అయితే.. ఆ విజయం తరువాత ఆస్ట్రేలియా జట్టుపై భారత్ 9.17శాతం ఆధిక్యంలో కొనసాగుతుంది.

Also Read : IND vs BAN : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సంజూ శాంస‌న్‌ల‌కు మొండిచేయి..

డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ను టీమిండియా సుస్థిరం చేసుకోవాలంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై జరిగే టెస్ట్ సిరీస్ లో పైచేయి సాధించాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో మూడు జట్లతో మొత్తం పది టెస్ట్ మ్యాచ్ లను టీమిండియా ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ జట్టుతో రెండు మ్యాచ్ లు కాగా.. ఇప్పటికే ఒక మ్యాచ్ పూర్తయింది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 27 నుంచి జరగనుంది. ఆ తరువాత న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టులు, ఆస్ట్రేలియా జట్టుతో బోర్డర్ – గవాస్కర్ ట్రోపీలో ఐదు టెస్టు మ్యాచ్ లను భారత్ జట్టు ఆడాల్సి ఉంది. రాబోయే తొమ్మిది మ్యాచ్ లలో మరో నాలుగు మ్యాచ్ లలో భారత్ విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ను ఖరారైనట్లే అవుతుంది. కనీసం మూడు మ్యాచ్ లలో విజయం సాధించి.. ఒక మ్యాచ్ డ్రా అయినా.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భారత్ ఆడే అవకాశాలు మెండుగా ఉంటాయి.

 

టీమిండియాకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా గట్టి పోటీ ఇవ్వనున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరాలంటే మరో నాలుగు మ్యాచ్ లు గెలవాల్సి ఉంది.. అలావీలుకాకుంటే.. మూడు మ్యాచ్ లు గెలిచి ఒక మ్యాచ్ ను డ్రా చేసుకున్నా ఫైనల్స్ చేరే అవకాశం ఉంటుంది. భారత్ కు గట్టి పోటీ ఇస్తున్న మరో జట్టు న్యూజిలాండ్.. న్యూజిలాండ్ మిగిలిన ఎనిమిది మ్యాచ్ లలో కనీసం ఆరు మ్యాచ్ లు గెవాల్సి ఉంటుంది. అలాకాకుంటే.. ఐదు మ్యాచ్ లలో విజయం సాధించి.. ఒక మ్యాచ్ ను డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే.. గత నెలలో పాకిస్థాన్ పై చారిత్రాత్మక 2-0 క్లీన్ స్వీప్ విజయంతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి చేరుకున్న బంగ్లాదేశ్ జట్టు.. తాజాగా టీమిండియాపై ఘోర ఓటమి తరువాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది.