ICC World Cup 2023: అఫ్గానిస్థాన్ వర్సెస్ భారత్ మ్యాచ్.. వాళ్లిద్దరిపైనే అందరిచూపు.. రికార్డుల మోత మోగిస్తారా?
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్ తో పాటు స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది. భారత్ మొదటి బ్యాటింగ్ చేస్తే పరుగుల వరద ఖాయం.

IND vs AFG Match
IND vs AFG Match Prediction : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా బుధవారం భారత్ వర్సెస్ ఆఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం మెగాటోర్నీలో జరుగుతున్న మ్యాచ్ లలో పరుగుల వరదపారుతోంది. ఈరోజు పసికూన జట్టుపై భారత్ తలపడుతున్న నేపథ్యంలో భారత్ బ్యాటర్ల నుంచి పరుగుల వరద ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అయితే, ఈ మెగాటోర్నీలో భారత్ తొలిమ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్ లో తృటిలో ఓటమి నుంచి తప్పించుకొని విజయాన్ని దక్కించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పసికూనతో ఫైట్ అయినా.. భారత్ బ్యాటర్లు ఆచితూచి ఆడాల్సిందే. ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా పసికూన చేతిలో పరాభవం పొంచిఉన్నట్లే.

IND vs AFG Match
ఓపెనర్లు గాడిన పడతారా?
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాంత్ కిషన్ డకౌట్ అయ్యారు. వీరితోపాటు సెకండ్ డౌన్ బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయస్ సైతం డకౌట్ అయ్యారు. కోహ్లీ, రాహుల్ క్రీజులో నిలవకపోయిఉంటే ఆసీస్ చేతిలో టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చేంది. ఈనెల 14న పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత్ జట్టుకు ప్రతిష్టాత్మకం. వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్ జట్టుపై భారత్ ఎప్పుడూ ఓడిపోలేదు. ఆ రికార్డును భారత్ జట్టు నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు ఆఫ్గానిస్థాన్ తో మ్యాచ్ జరుగుతుండటం భారత్ జట్టుకు కొంత ఊరటనిచ్చే అంశమే. ఎందుకంటే.. ఈ మ్యాచ్ ద్వారా గత మ్యాచ్ లో విఫలమైన బ్యాటర్లు ఫామ్ లోకి రావటానికి మంచి అవకాశం. ఈ మ్యాచ్ లో రోహిత్, ఇషాన్ కిషన్ లు క్రీజులో ఎక్కువ సేపు నిలబడితే భారత్ జట్టు భారీ స్కోర్ సాధించటం ఖాయమే.

ICC World Cup 2023
అందరిచూపు ఆ ఇద్దరిపైనే..
ఇండియా వర్సెస్ ఆఫ్గానిస్థాన్ మ్యాచ్ అనగానే.. క్రికెట్ అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చేది కోహ్లీ, నవీన్ ఉల్ హక్. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో వీరిద్దరి మధ్య పెద్ద వివాదమే జరిగింది. అప్పటి నుంచి ఆఫ్గాన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్ ను కోహ్లీ ఫ్యాన్స్ ఓ ఆటాడుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ సమయంలో నవీన్ ఉల్ హుక్ బౌలింగ్ వేస్తే.. వారిద్దరి హావభావాలు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

kohli and naveen ul haq
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్ తో పాటు స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది. భారత్ మొదటి బ్యాటింగ్ చేస్తే పరుగుల వరద ఖాయం. ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు ఆఫ్గానిస్థాన్ తో ఒక్కసారి మాత్రమే తలపడింది. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. వన్డే ఫార్మాట్ లో కూడా టీమిండియా రెండు మ్యాచ్ లు ఆఫ్గానిస్థాన్ ను ఓడించగా.. ఒక మ్యాచ్ టై అయింది.