PIC Credit @ IPL
Pant : ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్‌లో లీగ్ దశలో 14 మ్యాచులు ఆడిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. మొత్తంగా ఏడు విజయాలు సాధించిన ఢిల్లీ 14 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. అయితే.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ చివరి మ్యాచుల్లో అన్నింటిలోనూ ఓడిపోవాల్సి ఉంటుంది.
కాగా.. నిషేదం కారణంగా ఆదివారం (మే 12న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో పంత్ ఆడని సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ భారీ తేడాతో ఓడిపోవడంతో అది ఆ జట్టు నెట్‌రన్‌రేట్ పై ప్రభావం చూపించింది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో తాను ఆడి ఉంటే ప్రస్తుత పరిస్థితి వేరుగా ఉండేదని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ అన్నాడు.
DC vs LSG : ఏమయ్యా గోయెంకా.. పంత్‌ను కౌగిలించుకున్నావ్ సరే.. రాహుల్‌తో మళ్లీ ఏందిది..
లక్నో పై విజయం సాధించిన అనంతరం పంత్ మాట్లాడుతూ.. ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోగలిగి నందుకు కాస్త ఆనందంగానే ఉందన్నాడు. ఒకవేళ తాను బెంగళూరుతో మ్యాచ్‌లో ఆడి ఉంటే బహుశా తాము ప్లే ఆఫ్స్‌కు చేరి ఉండేవాళ్లమోనని అన్నాడు. తాను ఆడితేనే జట్టు గెలుస్తుందని చెప్పడం లేదని, విజయం సాధించేందుకు మెరుగైన అవకాశాలు మాత్రం ఉండేవని తెలిపాడు. ఆర్‌సీబీ చేతిలో ఓడిపోవడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారిందన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరల్ (33 బంతుల్లో 58), ట్రిసన్ స్టబ్స్ (25 బంతుల్లో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేశారు. లక్ష్య ఛేదనలో నికోలస్ పూరన్ (27 బంతుల్లో 61) పోరాడినప్పటికీ లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులకే పరిమితమైంది. దీంతో 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.