IND vs AUS : ఇదేం కెప్టెన్సీ.. శుభ్‌మ‌న్ గిల్ పై కైఫ్ విమ‌ర్శ‌లు..

ఆసీస్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో (IND vs AUS) శుభ్‌మ‌న్ గిల్ కెప్టెన్సీ పై మ‌హ్మ‌ద్ కైఫ్ అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు.

IND vs AUS : ఇదేం కెప్టెన్సీ.. శుభ్‌మ‌న్ గిల్ పై కైఫ్ విమ‌ర్శ‌లు..

IND vs AUS 1st ODI Mohammad Kaif slams Shubman Gill for Kuldeep Yadav snub

Updated On : October 21, 2025 / 12:38 PM IST

IND vs AUS : టీమ్ఇండియా వ‌న్డే కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ పై మాజీ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ కైఫ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాడు. పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో అత‌డి సార‌థ్యం ఏ మాత్రం బాగాలేద‌ని మండిప‌డ్డాడు. ఆదివారం ఆసీస్‌తో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ (IND vs AUS ) డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో స్టార్ స్పిన్న‌ర్ కుల్దీప్‌ యాద‌వ్ లేకుండానే భార‌త్ బ‌రిలోకి దిగింది. ఇందుకు భారీ మూల్య‌మే చెల్లించుకుంది. కుల్దీప్‌ను ప‌క్క‌న పెట్ట‌డంపై జ‌ట్టు మేనేజ్‌మెంట్ పై ఇప్ప‌టికే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో మ‌హ్మ‌ద్ కైఫ్ సైతం చేరిపోయాడు. పార్ట్‌టైమ్ బౌల‌ర్ల‌లో విజ‌యాలు సాధించ‌లేమ‌ని అన్నాడు. వికెట్ టేకింగ్ బౌల‌ర్ అయిన కుల్దీప్ యాద‌వ్‌ను ప‌క్క‌న బెట్ట‌డం అతి పెద్ద త‌ప్పు అని త‌న యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ చెప్పాడు.

IND vs SA : ఈడెన్ గార్డెన్స్‌లో భార‌త్ వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌.. రోజుకు 60 రూపాయ‌లే..

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న భార‌త బౌల‌ర్ల‌లో పాటు శుభ్‌మ‌న్ గిల్ కెప్టెన్సీ సామ‌ర్థ్యానికి కూడా ప‌రీక్ష అని అన్నాడు. కుల్దీప్ యాద‌వ్‌ను తుది జ‌ట్టులోకి తీసుకోవాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. అన్ని విభాగాల‌ను క‌వ‌ర్ చేశారు గానీ.. వికెట్ టేకింగ్ బౌల‌ర్‌ను మాత్రం తీసుకోలేద‌ని మండిపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్పిన్న‌ర్ మాథ్యూ కుహ్నెమన్ కూడా రెండు వికెట్లు ప‌డ‌గొట్టిన విష‌యాన్ని గుర్తు చేశాడు. బ్యాలెన్స్ కోసం అని నాణ్య‌త విష‌యంలో రాజీప‌డ‌కూడ‌ద‌ని సూచించాడు.

ఆసియాకప్ 2025 విజ‌యం సాధించ‌డంలో కుల్దీప్ యాద‌వ్ కీల‌క పాత్ర పోషించాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 17 వికెట్లు తీశాడు. ప్ర‌స్తుతం అత‌డు త‌న కెరీర్‌లోనే అత్యుత్త‌మ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో 12 వికెట్లు పడగొట్టాడు. ఇందులో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ 5/82. ఇక ఆస్ట్రేలియాపై కూడా అత‌డు మంచి రికార్డును క‌లిగి ఉన్నాడు. ఆసీస్‌తో జ‌రిగిన 23 వ‌న్డే మ్యాచ్‌ల్లో 31 వికెట్లు తీశాడు.

పార్ట్‌టైమ్ బౌల‌ర్ల‌లో గెల‌వ‌లేం..

స్టార్ పేస‌ర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ జ‌ట్టులో లేక‌పోవ‌డంతో మిగిలిన బౌల‌ర్లు ముందుకు వ‌చ్చి మ్యాచ్‌ను గెలిపించాల్సిన బాధ్య‌త తీసుకోవాల‌ని కైఫ్ తెలిపాడు. ‘ఈ జట్టులో చాలా మంది పార్ట్ టైమ్ బౌలర్లు ఉన్నారు. నితీష్ రెడ్డి పూర్తి స్థాయి బౌలర్ కాదు. పెర్త్ లాంటి పిచ్ పై సుంద‌ర్ కూడా పూర్తి స్థాయి బౌలర్ కాదు. ఇక హర్షిత్ రాణా తన బౌలింగ్‌తో తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. ల‌క్ష్యం చిన్న‌దైన‌ప్ప‌టికి కూడా జ‌ట్టును గెలిపించే బాధ్య‌త‌ను బౌల‌ర్లు తీసుకోవాలి. బుమ్రా, ష‌మీ ఉన్న‌ప్పుడే గెలుస్తారా?’ అని ప్ర‌శ్నించాడు. ఇక ఆసీస్ దిగ్గ‌జ స్పిన్న‌ర్ షేర్ వార్న్ మూడు ఫార్మాట్ల‌లో స‌త్తా చాటాడ‌నే విష‌యాన్ని మ‌రిచిపోకూడ‌ద‌ని చెప్పుకొచ్చాడు. ఆసీస్ వికెట్లు స్పిన్న‌ర్ల‌కు అనుకూలం కాద‌నే వాద‌న‌ను కొట్టిపారేశాడు.

Sunil Gavaskar : ఆ ప‌ద్ద‌తి ఏంటో అర్థం కాదు.. రోహిత్‌, కోహ్లీ వైఫ‌ల్యంపై స్పందించిన గ‌వాస్క‌ర్‌.. ఆ ఇద్ద‌రు..

భార‌త్‌, ఆసీస్ జ‌ట్ల మ‌ధ్య అడిలైడ్ వేదిక‌గా అక్టోబ‌ర్ 23న రెండో వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో భార‌త్ ఎలాంటి ప్లేయింగ్ ఎలెవ‌న్‌తో బ‌రిలోకి దిగుతోందో అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.