rishabh pant
IND vs BAN 2nd Test : భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య కన్పూర్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో వర్షం కారణంగా కేవలం 35 ఓవర్లు మాత్రమే కొనసాగాయి. టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బంగ్లా జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, వర్షం కారణంగా తొలిరోజు ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం వల్ల ఆట నిలిచే సమయానికి బంగ్లా జట్టు మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ లో వికెట్ల వెనుకఉన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పంత్ వికెట్ల వెనక నుంచి బౌలర్లకు సూచనలు చేస్తూ యాక్టివ్ గా ఉంటాడు. ఈ క్రమంలో సరదా వ్యాఖ్యలతో మైదానంలో సందడి చేస్తుంటాడు. తాజాగా బంగ్లాదేశ్ బ్యాటర్లను పంత్ ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. ఇన్నింగ్స్ 33వ ఓవర్లో మోమినుల్ హక్ బ్యాటింగ్ చేస్తున్నాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ముష్పీకర్ రహీమ్ నిలబడి ఉన్నాడు. భారత్ తరపున రవిచంద్రన్ అశ్విన్ బంతిని ఆడుతున్నాడు. ‘హెల్మెంట్ నుంచి ఎల్బీడబ్ల్యూ తీయొచ్చు సోదరా’ అని పంత్ అన్నాడు. ఇదివిని ఇంగ్లీష్ కామెంట్రీ చేస్తున్న భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు. అదే ఓవర్ లో మోమినుల్ హక్ స్వీప్ చేసేందుకు ప్రయత్నించగా.. బంతి అతని హెల్మెంట్ కు తగిలినందున పంత్ ఈ వ్యాఖ్య చేశాడు.
మొదటి రోజు ఆట వర్షం కారణంగా నిలిచిపోయింది. మోమినుల్ హక్ (40 నాటౌట్), ముష్ఫీకర్ రహీమ్ (6 నాటౌట్) తో క్రీజులో ఉన్నారు. శనివారం కూడా వర్షంపడే అవకాశం 80శాతం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే, రెండు సెషన్ల వరకు ఆట కొనసాగే అవకాశం ఉంది.