IND vs ENG : ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో భారత్ జట్టు ఓటమి పాలైంది. దీంతో మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. తొలి టెస్టులో జట్టు కూర్పుసరిగా లేదని, అందుకే భారత్ జట్టు ఓడిపోయిందని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో జులై 2 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టెస్టుకోసం భారత్ జట్టులో కీలక మార్పులు చేసేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ బృందం కసరత్తు మొదలు పెట్టింది.
Also Read: ICC Test Rankings : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..
తొలి మ్యాచ్‌లో ఫెయిలైన శార్దూల్ ఠాకూర్ స్థానంలో చైనామాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. తొలి టెస్టులో శార్దూల్‌ను ఆడించాలన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిర్ణయాన్ని చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ సమర్థించినా.. రెండో టెస్టు జట్టు ఎంపికపై పెద్దగా స్పందించలేదు. మరోవైపు.. తొలి టెస్టులో నలుగురు పేసర్లతో ఆడటంపై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. అయితే, రెండో టెస్టు జరిగే బర్మింగ్ హోమ్ పిచ్ స్పిన్నర్లకు బాగా సహకరిస్తుంది. దీంతో జడేజాతో పాటు కుల్దీప్ కూడా ఉండాలని మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ అభిప్రాయడ్డారు.
తొలి టెస్టులో కుల్దీప్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. రెండో టెస్టులో కుల్దీప్‌ను ఆడించాలని, అవసరమైతే నితీశ్ ను కూడా తీసుకోవాలని అన్నారు. ఎందుకంటే.. ఆస్ట్రేలియాలో నితీశ్ బాగా ఆడాడు. నా వరకైతే తొలి టెస్టులోనే ఆడిస్తే బాగుండేది. రెండో టెస్టుకైనా ఇండియా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇంగ్లాండ్ లో ఆడేటప్పుడు నాణ్యమైన బౌలర్లే ఉండాలి. అందులో ఇద్దరు స్పిన్నర్లు తప్పనిసరిగా ఉండాలని మంజ్రేకర్ అన్నారు.