IND vs WI Shubman Gill comments after India series win against west indies
IND vs WI : వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం గమనార్హం. ఈ క్రమంలో గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము గెలవాలనే లక్ష్యంతోనే విండీస్‌ను ఫాలో ఆన్ ఆడించామని చెప్పుకొచ్చాడు.
‘టీమ్ఇండియాకు సారథ్యం వహించడం ఎల్లప్పుడు గొప్ప గౌరవం. ఇక కెప్టెన్సీకి నేను అలవాటు పడుతున్నాను. పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటాను. కండిషన్స్‌కు తగ్గట్లు ఏ ప్లేయర్ పరుగులు సాధిస్తాడు ? ఏ బౌలర్ వికెట్ తీస్తాడనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.’ అని గిల్ అన్నాడు.
IND vs WI : అవార్డులు, నగదు బహుమతులు అందుకున్న ప్లేయర్లు వీరే.. ఎవరికి ఎంతంటే..?
తొలి ఇన్నింగ్స్‌లో సుమారు 300 పరుగుల ఆధిక్యం లభించిందని, మరోసారి బ్యాటింగ్ చేసి 500 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించినా.. ఆఖరి రోజు ఆరు లేదా ఏడు వికెట్లు తీయాల్సి వస్తే కష్టం అవుతుందని భావించే విండీస్‌ను ఫాలో ఆన్ ఆడించినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ముందు నితీశ్‌కుమార్ రెడ్డికి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించాలనే బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపించినట్లుగా తెలిపాడు.
విదేశాల్లో నేరుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే ప్లేయర్లు ఒత్తిడికి గురి అవుతారు. అందుకనే స్వదేశంలో కొందరు ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి విదేశీ పర్యటనకు సిద్ధం చేయాలని అనుకున్నట్లు తెలిపాడు. ఇక తాను ఎప్పుడూ ఓ బ్యాటర్‌గానే నిర్ణయాలు తీసుకుంటానని చెప్పాడు. తాను ఏం చేసినా జట్టు విజయం కోసమే చేస్తానన్నాడు.
ఆస్ట్రేలియా పర్యటనపై స్పందిస్తూ.. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రణాళికలు రచించలేదన్నాడు. అది సుదీర్ఘ విమాన ప్రయాణమని, ఫ్లైట్‌లో కూడా ప్లాన్ చేసుకోవచ్చునని తెలిపాడు.