IND vs WI : ‘మేం ఓడిపోయినా.. 100 ఓవర్లు ఆడాం..’ వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ కామెంట్స్ వైరల్..
భారత్‌తో రెండో టెస్టులో ఓడిపోవడం పై (IND vs WI) వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ స్పందించాడు.

Roston Chase Comments after west indies lost match to India in 2nd test
IND vs WI : ఢిల్లీ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కూడా తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ తెలిపాడు. చాలా కాలం తరువాత ఓ ఇన్నింగ్స్‌లో 100 ఓవర్ల కంటే ఎక్కువ బ్యాటింగ్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు.
మ్యాచ్ అనంతరం రోస్టన్ ఛేజ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కూడా తమకు ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పాడు. క్యాంప్‌బెల్, షై హోప్‌లు జట్టు కోసం అద్భుతంగా పోరాడారని, శతకాలతో రాణించారన్నాడు. ఇక చాలా కాలం తరువాత టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో 100 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేయడం బాగుందన్నాడు. ఇది అతి పెద్ద సానుకూలాంశమని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్‌ను ఐదో రోజుకు తీసుకువెళ్లడం చాలా గొప్ప విషయం అని తెలిపాడు.
వాస్తవానికి 80 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడానికి తాము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తామని చెప్పాడు. ఇందుకు కావాల్సిన మార్గాలను కనుగొంటామన్నాడు. బ్యాక్‌ఫుట్‌లో ఆడడం, స్వీపింగ్, ఫుట్ వర్క్ ఉపయోగించడం వంటి వ్యూహాలతో స్పిన్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని తెలిపాడు. ప్రస్తుత టీమ్‌లో ఉన్న ఆటగాళ్లు కరేబియన్‌లోనే అత్యుత్తమ ఆటగాళ్లు అని, ఈ చివరి మ్యాచ్‌ను రాబోయే సిరీస్‌కు ఓ పునాదిగా భావిస్తామని తెలిపాడు. ఈ ఓటముల నుంచి నేర్చుకుని వీలైనంత మెరుగు అయ్యేందుకు ప్రయత్నిస్తామని ఛేజ్ తెలిపాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 518/5 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఆ తరువాత వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌలైంది. దీంతో భారత్‌కు 270 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పోనూ భారత్ ముందు 121 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో భారత్.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.