Ravi Shastri : రోహిత్, కోహ్లీ భవితవ్యం పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు.. ఆసీస్ టూర్ కీలకం.. ఆ తరువాతే..
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవితవ్యం పై మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

Ravi Shastri makes comment on Rohit Sharma and Virat Kohli 2027 World Cup chances
Ravi Shastri : వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ముగిసింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ పై పడింది. అక్టోబర్ 19 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఎలా రాణిస్తారు అన్న దానిపైనే అందరి దృష్టి నెలకొంది. టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు.. వన్డే ప్రపంచకప్ 2027 తమ లక్ష్యం అని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పేశారు. అందుకోసం సన్నద్ధం అవుతున్నారు.
అయితే.. టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ యువ ఆటగాళ్లకు అండగా ఉండాడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రో-కో ద్వయం రాణించకుంటే వాళ్ల పై వేటు పడక తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే భవితవ్యంపై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవితవ్యంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నాడు. వారిద్దరు వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్నారని, అందుకనే ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక అయ్యారని చెప్పాడు. అయితే.. ఫామ్, ఫిట్‌నెస్ పైనే వారి ప్రపంచకప్ భవితవ్యం ఆధాపడి ఉంటుందన్నాడు. వారిద్దరు ఫామ్‌ను కొనసాగిస్తూ ఫిట్‌గా ఉంటే మాత్రం రెండేళ్ల తరువాత జరిగే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందని వ్యాఖ్యానించాడు.
‘వారి భవితవ్యంపై నిర్ణయం తీసుకునే దిశగా ఆస్ట్రేలియాతో సిరీస్ వారిద్దరికి ఎంతో కీలకం కానుంది. ఈ సిరీస్‌తో వారిద్దరు తమ కెరీర్‌లపై ఓ నిర్ణయానికి రావొచ్చు. యువ ఆటగాళ్ల నుంచి పోటీ పెరుగుతుందని వారిద్దరికి తెలుసు. ఇక జట్టు ప్రణాళికల్లో ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని వారిద్దరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.’ అని రవిశాస్త్రి అన్నారు.