India Women vs Bangladesh Women : కీలక పోరులో అదరగొట్టిన జెమిమా రోడ్రిగ్స్.. రెండో వన్డేలో బంగ్లాదేశ్ చిత్తు.. సిరీస్ సమం
కీలక పోరులో భారత మహిళలు సత్తా చాటారు. ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో జెమిమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్ పై టీమ్ఇండియా 108 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Jemimah Rodrigues
India women vs Bangladesh women 2nd ODI : కీలకమైన పోరులో భారత మహిళలు సత్తా చాటారు. ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో జెమిమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్ పై టీమ్ఇండియా 108 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మకమైన ఆఖరి వన్డే శనివారం జరగనుంది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ 40 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోగా భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. జెమిమా రోడ్రిగ్స్ (86; 78 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (52; 88 బంతుల్లో 3 ఫోర్లు) అర్థశతకాలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (36), హర్లీన్ డియోల్ (25) రాణించగా ప్రియా పునియా(7), యాస్తిక భాటియా (15), దీప్తి శర్మ(0)లు విఫలం అయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖాతున్, నహిదా చెరో రెండు వికెట్లు పడగొట్టగా రబేయా ఖాన్, మరుఫా ఒక్కొ వికెట్ తీశారు.
Rohit Sharma : బర్త్‌డే బాయ్నే గిఫ్ట్ అడిగిన రోహిత్ శర్మ.. పాపం ఇషాన్ కిషన్ ఇచ్చేనా..!
అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 35.1 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్ల ధాటికి 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన బంగ్లాదేశ్‌ను ఫర్గానా హోక్(47; 81 బంతుల్లో 5 ఫోర్లు) రీతు మోని (27; 46 బంతుల్లో 3 ఫోర్లు)ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్ కు 68 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
రోడ్రిగ్స్ మాయ..
4 వికెట్ల నష్టానికి 106 పరుగులతో బంగ్లాదేశ్ లక్ష్యం దిశగా సాగుతున్న తరుణం అది. ఆ సమయంలో బంతిని అందుకున్న రోడ్రిక్స్ అద్భుతం చేసింది. 3.1 ఓవర్లలో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. దీంతో లక్ష్యం దిశగా సాగుతున్న బంగ్లాదేశ్ ఒక్కసారిగా కుప్పకూలింది. 14 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో రోడ్రిక్స్ నాలుగు, దేవికా వైద్య మూడు వికెట్లు పడగొట్టగా స్నేహా రాణా, దీప్తి శర్మ, మేఘనా సింగ్ ఒక్కొ వికెట్ తీశారు.
కాగా.. ఈ మ్యాచ్‌లో జెమిమా రోడ్రిగ్స్ కెరీర్లో అటు బ్యాటింగ్‌లో గానీ, ఇటు బౌలింగ్‌లో గానీ కెరీర్ అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసింది. విజయంలో కీలక పాత్ర పోషించడంతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకుంది.