India beat New Zealand by six wickets
NZW vs INDW : భారత అమ్మాయిలు అదరగొట్టారు. మంగళవారం ఇక్కడ అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో మహిళల వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని 2-1తో భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీని సాధించింది.
మంధానకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు :
233 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 44.2 ఓవర్లలోనే కేవలం 4 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. మంధాన 122 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. యాస్తికా భాటియా (35), రోడ్రిగ్స్ (22) కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు. మంధాన అద్భుతమైన ఇన్నింగ్స్ తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకుంది.
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ మహిళల జట్టు 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ బ్రూక్ హాలిడే 96 బంతుల్లో 86 పరుగులు చేసి న్యూజిలాండ్‌లో టాప్ స్కోరరుగా నిలిచింది. ఫ్లిమర్మర్ (39) పరుగులు చేయగా, మిగతా ఎవరూ రాణించలేదు. గేజ్ 25 పరుగులు, తహుహు 24 పరుగులతో రాణించారు.
ఇటీవలి టీ20 ప్రపంచ కప్‌లో ముందుగానే నిష్క్రమించి కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందాలని చూస్తున్న భారత మహిళల జట్టు ఈ మూడో వన్డేలో గెలిచి సిరీస్ విజయంతో లక్ష్యాన్ని సాధించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, ప్రియా మిశ్రా 2 వికెట్లు, రేణుక సింగ్, సైమా ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.
మిథాలీ రికార్డు బ్రేక్ చేసిన మంధాన :
మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ రికార్డును స్మృతి మంధాన బ్రేక్ చేసింది. భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు నమోదుచేసిన మహిళా క్రికెటర్‌గా మంధాన రికార్డు నెలకొల్పింది. ఆడిన 88 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించింది. మిథాలీ 232 వన్డేల్లో 7 సెంచరీలు చేయగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మూడో స్థానంలో నిలిచింది. 135 వన్డే మ్యాచ్‌ల్లో 6 సెంచరీలను తన ఖాతాలో వేసుకుంది.
Read Also : Kapil Dev – Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబుతో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ భేటీ..